రెచ్చగొట్టి రాజకీయాలు చేయాలనుకుంటే… ప్రత్యర్థి ఇలాకాలో రెచ్చిపోవడమే రాజకీయం ప్రధమ సూత్రం. ఇది వైసీపీ నేతలకు తెలిసినట్లుగా ఎవరికీ తెలియదేమో. నేరుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం నారా వారి పల్లెల్లో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓ బహిరంగసభ ఏర్పాటు చేశారు. అంతా కలిసి.. వెయ్యి మంది కూడా ఉండని ఆ గ్రామంలో బహిరంగసభ పెట్టి.. బయట ప్రాంతాల నుంచి పాతిక వేల మందిని రప్పించడానికి ఏర్పాట్లు చేశారు. ఆ బహిరంగసభ ఉద్దేశం.. మూడు రాజధానులను సమర్థించడం. చంద్రబాబు… తిరుపతిలో పర్యటించి వెళ్లిన తర్వాత కౌంటర్ గా.. ఏదైనా చేయాలని ఆలోచించిన చెవిరెడ్డి.. అందుకు నారావారా పల్లెనే ఎంచుకున్నారు. అయితే.. నారా వారి పల్లె గ్రామస్తులు మాత్రం చెవిరెడ్డి ప్రయత్నాలను వ్యతిరేకించారు.
ప్రభుత్వం వారిది కాబట్టి… పోలీసుల్ని పెట్టి మరీ ఏర్పాట్లు పూర్తి చేసుకున్న చెవిరెడ్డి… హడావుడి మామూలుగా చేయలేదు. దీంతో.. అక్కడి మహిళలు … తాము కూడా పోటీ ర్యాలీకి ప్రయత్నం చేశారు. శాంతియుత నిరసన చేపట్టడానికి సిద్ధమయ్యారు. ఏ కోణంలో చూసినా… చంద్రబాబు స్వగ్రామంలో.. రెచ్చగొట్టే సభ పెట్టడానికి పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వకూడదు. కానీ చిత్తూరు పోలీసుల ఆలోచనా ధోరణి వేరేలా ఉంది. నారా వారి పల్లెలో సభకు అనుమతి ఇచ్చేశారు. అదే సమయంలో నారా వారి పల్లె గ్రామస్తులు చేయాలనుకున్న శాంతియుత నిరసనలకు అనుమతి నిరాకరించారు. దాంతో రోజందా .. ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరించారు.
ఈ పరిణామాలపై తెలుగుదేశం పార్టీ మండిపడింది. రాయలసీమలో కక్షలు, కార్పణ్యాలు పెంచి పోషించి.. ప్రాంతీయ విబేధాలు సృష్టించాలని స్వయంగా ప్రభుత్వమే కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. వారా వారి పల్లెలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటం.. ప్రభుత్వం నేరుగా చేస్తున్న దాడిగా… టీడీపీ పేర్కొంటోంది. వైసీపీ నేతలు ఇప్పటికే టీడీపీ నేతల ఇళ్లను కాగడాలతో ముట్టడిస్తూ.. అలజడి రేపుతున్నారు. ఇప్పుడు నేరుగా.. చంద్రబాబు స్వగ్రామాన్నే ముట్టడించే ప్రయత్నం చేయడం… రాష్ట్రంలో పాలనా వైఫల్యానికి నిదర్శనమని విపక్ష నేతలు అంటున్నారు.