రాజకీయాల వైపు వచ్చే చాన్సే లేదని చిరంజీవి మరోసారి ప్రకటించారు. తన ఆశయాలను సోదరుడు పవన్ కల్యాణ్ ముందుకు తీసుకెళ్తున్నారని తాను పూర్తిగా సినిమాలపై పరిమితమవుతానన్నారు. ఇటీవల చిరంజీవి ఏ రాజకీయ నాయకుడ్ని కలిసినా ఆయన పార్టీలోకి వెళ్తారన్న ప్రచారాం జరుగుతోంది. చివరికి ఆయన జనసేన గౌరవాధ్యక్షుడిగా వస్తాయన్న ప్రచారమూ ఓ దశలో జరిగింది. వీటన్నింటికీ చిరంజీవి మరోసారి క్లారిటీ ఇచ్చారు. తన జీవితంలోకి మరోసారి రాజకీయం రాబోదని స్పష్టం చేశారు.
చిరంజీవి రాజకీయాల్లోకి తెచ్చేందుకు చాలా మంది ప్రయత్నాలు
చిరంజీవి తాను రాజకీయాల్లో చేసిన తప్పులేమిటో స్పష్టంగా తెలుసుకున్నారు. అందుకే ఆయన రాజకీయాల నుంచి విరమించుకున్నారు. రాజ్యసభ సభ్యత్వం ముగియక ముందే ఆ నిర్ణయం తీసుకున్నారు. సమావేశాలకూ వెళ్లలేదు. ఇప్పటికీ దానికే కట్టుబడి ఉన్నారు. అయితే ఆయనను మళ్లీ రాజకీయాల్లోకి తెచ్చేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. అందులో వైసీపీ అధినేత జగన్ నుంచి భారతీయ జనతా పార్టీ ముఖ్యనేతల వరకూ ఉన్నారు. అయితే చిరంజీవి ఎప్పుడూ.. దేనికీ టెంప్ట్ కాలేదు. రాజకీయం అంటే ఏంటో ఆయనకు బాగా తెలుసు కాబట్టి మరోసారి అందులోకి వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదు. చూపించే చాన్స్ కూడా లేదని ఆయన మాటల ద్వారా స్పష్టమయిది.
చిరంజీవికి ఉన్న ప్రజాకర్షణపై రాజకీయ పార్టీల గురి !
చిరంజీవికి ఉన్న ప్రజాకర్షణ గురించి చెప్పాల్సిన పని లేదు. సెల్ఫ్ మేడ్ మెగాస్టార్ ఆయన. ఆయన కు లక్షలాది మంది ప్యాన్స్ ఉన్నారు. చిరంజీవికి అత్యున్నత గౌరవం ఇవ్వడం ద్వారా వారిని ఆకట్టుకోవాలని రాజకీయ నేతల ప్రయత్నం. కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో చిరంజీవి దూరమయ్యారు. అలాగని బీజేపీతో దగ్గరగా లేరు. కానీ ఆయనకు బీజేపీతో శత్రుత్వం కూడా లేదు. చిరంజీవిని బీజేపీ గౌరవిస్తోంది. ఆ గౌరవాన్ని చిరంజీవి కాదనలేరు . బీజేపీ వ్యూహాల వెనుక రాజకీయం ఉండవచ్చు కానీ.. చిరంజీవి మాత్రం ఎప్పటికప్పుడు అదంతా రాజకీయం కాదని సంకేతాలు ఇస్తున్నారు. దాంతో ఆయా రాజకీయ పార్టీల క్రెడిట్ గేమ్స్ సక్సెస్ కావడం లేదు.
పవన్ ను దెబ్బతీసేందుకు కొంత మంది చిరంజీవిని ప్రయోగించే ప్రయత్నం
నిజానికి చిరంజీవికి ప్రాముఖ్యత పెరిగింది .. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టిన తర్వాత. పవన్ బలంగా తనదైన ముద్ర వేయడంతో ఆయన ఓటు బ్యాంకును చెల్లాచెదురు చేయడానికి చిరంజీవిని ప్రయోగించాలని అనుకుంటున్నారు. ఇందుకోసం జగన్ చేసిన ప్రయత్నాలకు చిరంజీవి చెక్ పెట్టారు. తన సోదరుడికి వంద శాతం మద్దతు ప్రకటించారు. వైసీపీ తన ఇేమేజ్ ను పేర్ని నాని వంటి వారితో వాడుకునే ప్రయత్నం చేసినా సమయం చూసి దెబ్బకొట్టారు.
చిరంజీవి నొప్పింపక తానొవ్వక అన్న రీతిలో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. రాజకీయ పార్టీలు కూడా ఆయనను వాడేసుకుందామన్న ఆలోచనను ఆపేసి.. ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తే మంచిదని ఆయన ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.