అనంతపురం వైసీపీ రాజకీయాలు చిందరవందరగా మారిపోయాయి. ఎమ్మెల్యేలు, ఇంచార్జులపై వ్యతిరేకత ప్రజల్లో కాదు. సొంత క్యాడర్లోనే తీవ్రంగా కనిపిస్తోంది. పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని వైసీపీ హైకమాండ్కూ సర్వేలు ద్వారా క్లారిటీ రావడంతో ముందు ఇంటిని చక్కదిద్దుకోవడానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికిని అక్కడకు పంపింది. ఆయన నియోజకవర్గాల విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయిస్తున్నారు. వాటికి తానే హాజరవుతున్నారు. కానీ అక్కడ ఆయనకూ సెగ తగులుతోంది. తాజాగా పెనుకొండలో ఆయనపై చెప్పులు కూడా వేశారు సొంత పార్టీ నేతలు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2014లో టీడీపీ స్వీప్ చేస్తే.. 2019లో వైసీపీకి ఆ చాన్స్ దక్కింది. బాలకృష్ణ, పయ్యావుల కేశవ్ మాత్రమే గెలిచారు. అప్పట్లో టీడీపీకి ఈ గతి పట్టడానికి నేతల మధ్య ఆధిపత్య పోరాటమే కారణం. ఇప్పుడు వైసీపీకి ఆ పరిస్థితి ఉంది. ఆధిపత్య పోరాటానికి తోడు ఎమ్మెల్యేలపై క్యాడర్లోనే తీవ్ర వ్యతిరేకత ఉంది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి. జగన్ ముద్దు.. ఎమ్మెల్యే వద్దని ప్రతీ నియోజకవర్గంలో క్యాడర్ రోడ్డెక్కుతున్నారు.
చివరికి నిన్నామొన్నటి వరకూ మంత్రిగా పని చేసిన శంకర్ నారాయణ.. ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఉషాశ్రీచరణ్కూ అసమ్మతి తప్పడం లేదు. వారికి సీటి్స్తే పని చేసేది లేదని క్యాడర్ చెబుతున్నారు. ప్రతీ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఉండటం.. మీడియాలో హైలెట్ అవుతూండటంతో.. సమన్వయ పరిచేందుకు వచ్చిన మంత్రి పెద్దిరెడ్డి.. అసమ్మతి అన్ని చోట్లా ఉంటుందని.. పులివెందులలో కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. కానీ అనంతపురంలో అసమ్మతి ఏంటో.. ఆయనకు పెనుకొండలో తెలిసింది.
టీడీపీ నేతల్లోనూ ఈ సమస్య ఉంది కానీ.. మరీ దారుణంగా లేదు. చంద్రబాబు ఇటీవల ఎవరి నియోజకవర్గాలకు వారు సరిపెట్టారు. ఇతరుల చోట్ల వేలు పెట్టవద్దని హెచ్చరించారు. వచ్చే సారి టీడీపీ అధికారంలోకి రావడం ఎంత ముఖ్యమో.. అనంత నేతలకు అర్థమైపోయింది. అందుకే వారు సొంత పోరాటం కన్నా.. వైసీపీపై పోరాటం మీదనే దృష్టి పెట్టారు. వైసీపీలో మాత్రం.. వర్గ పోరాటం కంట్రోల్ చేయలేనంతగా పెరిగింది.