తననే కెప్టెన్గా కొనసాగించాలంటూ రాసిన లేఖలపై క్రికెటర్లను బెదిరించి విహారీ సంతకం పెట్టించుకున్నారట. ఆ మేరకు క్రికెటర్లు లేఖలు ఇచ్చారట. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తాజాగా ఆయనపై మోపిన నింద ఇది. క్రికెటర్ల జీవితాలు ఎవరి చేతుల్లో ఉంటాయో.. హనుమ విహారీ లాంటి ఇంటర్నేషనల్ క్రికెటర్ కెప్టెన్సీని కూడా అడ్డగోలుగా తీసేసిన వైనమే చెబుతుంది. మరి విహారీ ఎలా బెదిరించగలరు ?. విహారీకి వ్యతిరేకంగా భారీ కుట్ర చేస్తున్న ఏసీఏ.. ఆయనపై బురద చల్లేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు.
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ లో చొరబడి విజయసాయిరెడ్డి కుటుంబం .. ఆయన వంది మాగధులు చేస్తున్న అరాచకం అంతా ఇంతా కాదు. ప్రతిభావంతులైన ఆటగాళ్ల కంటే.. పరిచయస్తులు… పలుకుబడి ఉన్న వారు.. కొనుక్కున్న వారికే వివిధ దశల్లో ఆడే అవకాశం లభిస్తుందన్న ఆరోపణలు బహిరంగంగా ఉన్నాయి. మీతి మీరిన రాజకీయ జోక్యంతో ఏసీఏ అసలు ఎదగడం లేదు. ఇప్పుడు విహారీ ఉదంతంతో రోడ్డున పడింది. పైగా ఆటగాడిపై పదే పదే నిందలు వేస్తూ.. లేఖలు రాస్తున్నారు.
హనుమ విహారికి మద్దతుగా టీడీపీ సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏసీఏలో రాజకీయ నాయకుడు అయిన విజయసాయిరెడ్డి పెత్తనం.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుడు అయిన శరత్ చంద్రారెడ్డి అధ్యక్షుడిగా ఉండటంతో… టీడీపీ .. విహారీ ఉదంతంలో నిలదీసింది. దీనికి సమాధానం చెప్పకుండా విహరిపై విషం కక్కుతూ మీడియా ప్రకటనలు విడుదల చేస్తున్నారు. ఒక తప్పును కప్పి పుచ్చుకోవడానికి మరో తప్పు చేస్తున్నారు. చివరికి ఆ వైసీపీ చోటా లీడర్ కూడా మీడియా ముందుకు విహారి సంగతి తేలుస్తానని హెచ్చరిస్తున్నారు.