2023కి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుగుతాయి. దీన్ని వైసీపీ హైజాక్ చేయాలని నిర్ణయించుకుంది. కొడాలి నాని నేతృత్వంలో ఇప్పటికే ప్లాన్ రెడీ అయిపోయింది. నిమ్మకూరులో నుంచి కొంత మందిని ఇటీవల కొడాలి నాని సీఎం వద్దకు తీసుకెళ్లారు. వారంతా ఎన్టీఆర్ కుటుంబసభ్యులని చెప్పి కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు సీఎంకు ధన్యవాదాలు చెప్పించారు. అదే సమయంలో నిమ్మకూరు లో ఉన్న చెరువులో ఎన్టీఆర్ కాంస్య విగ్రహన్ని పెట్టాలని కోరగా అందుకు సీఎం అంగీకరించారని ప్రకటించారు.
ఎన్టీఆర్ కు వందేళ్లు నిండిన సందర్భంగా మే లో విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సీఎం అంగీకరించినట్లు కొడాలి నాని ప్రకటించారు. ఇప్పటికే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని ఎన్టీఆర్కు ఇచ్చిన గొప్ప గౌరవంగా ప్రచారం చేసుకునేందుకు వైసీపీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పుడు ఎన్టీఆర్ వందో పుట్టిన రోజు వేడుకల్ని కూడా నిమ్మకూరులో అయినా ఘనంగా చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయనను నిమ్మకూరుకే పరిమితం చేసినా రాజకీయంగా మైలేజీ తెచ్చుకోవడానికి చేయగలిగినంత చేయాలన్న తాపత్రయంలో ఉన్నారని అర్థమవుతోంది.
అయితే ఎన్టీఆర్ను ఆకాశానికెత్తే క్రమంలో సొంత ఓటు బ్యాంక్ మనోభావాలు దెబ్బకూడదన్న ఉద్దేశంతో కృష్ణా జిల్లా వరకూ ఆ ఉత్సవాలు ఉండేలా వైసీపీ చూసుకునే అవకాశం ఉంది. ఎన్టీఆర్ను ఎన్నో సార్లు అవమానించినా.. ఎన్టీఆర్ విగ్రహాలు బద్దలు కొట్టినా ఎప్పుడూమాట్లాడని వైసీపీ నేతలు ఇప్పుడు విగ్రహాలు పెట్టిస్తామనే స్థాయికి వచ్చారంటే .. రాజకీయం ఎలా మారుతుందో అర్థమవుతోందని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.