తిరుమల తిరుపతి దేవస్థానంతో వైసీపీ రాజకీయ వ్యాపారం చేస్తోంది. గత కొద్ది రోజులుగా తిరుమల కొండ పూర్తిగా రాజకీయ నేతల అనుచరుల గుప్పిట్లోకి మారిపోయింది. వైసీపీ నియోజకవర్గ ఇంచార్జులు… తమ క్యాడర్ ను ప్రసన్నం చేసుకునేందుకు పెద్ద ఎత్తున లీడర్లను తీసుకుని తిరుమల దర్శనానికి వస్తున్నారు. ముందస్తు అనుమతులు… టిక్కెట్లుకూడా వారికి అక్కర్లేదు. కొండ మీదకు రాగానే.. రాచ మర్యాదలు జరుగుతున్నాయి. బ్రేక్ దర్శనం ఇప్పిస్తున్నారు. తీర్థ ప్రసాదాలు ఇస్తున్నారు.
గత పది రోజులుగా ఇవి పెరిగిపోయాయి. దీంతో భక్తులు కూడా తీవ్ర అసహనానికి గురవుతున్నారు. బ్రేక్ దర్శనానికి వెళ్లాలంటే శ్రీవాణి టిక్కెట్ పేరుతో పది వేల రూపాయలు వసూలు చేస్తున్న టీటీడీ… అదే వైసీపీ కార్యకర్తల వద్ద మాత్రం… ఐదు వందలే వసూలు చేస్తున్నారు. ఈ అంశంపై దుమారం రేగుతోంది. గత పదిహేను రోజుల నుంచి టీటీడీ బ్రేక్ దర్శనాల జాబితాను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఎవరి సిఫారసు మేరకు ఎన్ని టిక్కెట్లు ఇచ్చారో చెప్పాలని అంటున్నారు.
దేవుడ్ని మార్కెటింగ్ చేసుకోవడంలో వైసీపీని మించిన వారు లేరు. ఇప్పటికే టీటీడీలో ఒక్కటంటే ఒక్క వ్యవస్థ సరిగ్గా పని చేయడంలేదు. టీటీడీలో ఉన్నతాధికారులంతా దేవుడి పేరు చెప్పి దేశవ్యాప్తంగా లాబీయింగ్ చేస్తూ ఉంటారు. రాజకీయ నేతల్ని బుజ్జగించడానికి దర్శనాలను ఉపయోగించుకుంటున్నారు. వీరి తీరు చూసి భక్తులు ముక్కున వేలేసుకుంటారు. దేవుడితో ఆటలొద్దని.. మంచిది కాదని సలహాలిస్తున్నారు. టీటీడీలో ఉన్న వారికి దేవుడిపై భక్తి, భయం ఉంటే.. ఇలాంటివి చేయరు. కానీ వారికి అవి ఉన్నాయా లేవా అన్నది వారికే తెలియాలి.