ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు భిన్నమైన రాజకీయం నడుస్తోంది. వైసీపీ గెలుస్తుందని.. ప్రాధాన్య పోస్టుల కోసం.. అధికారులు… ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తూంటే… మరో వైపు వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు.. అధికారులపై బెదిరింపులకు దిగుతున్నారు. ఇసుక రీచ్ల నుంచి.. రేషన్ దుకాణాల వరకూ.. అన్నింటినీ మార్క్ చేసి పెట్టుకుంటున్నారు. ఖాళీగా ఉంటే.. ఎవరికీ… ఇవ్వవొద్దని అల్టిమేటం జారీ చేస్తున్నారు. టీడీపీ నేతల దగ్గర ఉంటే… మే 23 తర్వాత వాటిని తమకు అప్పగించేలా… అధికారులకు సూచనలు కూడా జారీ చేస్తున్నారు. ఈ పరిస్థితి.. ఉపాధిహామీ ఫీల్డ్ అసిసెంట్ల వరకూ ఉంది. శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకూ.. వైసీపీ నేతల తీరు.. అధికార వర్గాల్లో సైతం చర్చనీయాంశమవుతోంది.
కృష్ణా జిల్లాలో ఓ ఇసుక రీచ్ ను అధికారులు నిలిపివేశారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు తమకు తెలియకుండా రీచ్ లను ఎవరికీ ఇవ్వవద్దని కృష్ణాజిల్లాలోని గనుల శాఖ కార్యాలయానికి వెళ్లి అధికారులకు హుకుం జారీ చేశారు. ఇది ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినా… పై స్థాయిలో జరుగుతున్న పరిణామాలతోనే ఏమీ చేయలేని పరిస్థితి. గ్రామాలలో ఖాళీగా ఉన్న చౌకడిపోలను ఎవరికీ కేటాయించవద్దని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని భర్తీ చేస్తామంటూ వైసీపీ నేతలు సంబంధిత అధికారులకు మండల, డివిజన్ స్థాయిలో ఆదేశాలు ఇస్తున్నారు. చౌకడిపోల డీలర్ షిప్ లకు పరీక్షలు ఉంటాయని చెబుతున్నా.. వారు లెక్క చేయడం లేదు. డిపోలు ఇచ్చే అధికారం ఎమ్మెల్యేలకు ఇచ్చే విధంగా ఉత్తర్వులు తీసుకువస్తామని ముందుగానే చెబుతున్నారు.
అంగన్ వాడి టీచర్ల నియామకంపై కూడా వైసీపీ నేతలు ఆరా తీస్తున్నారు. అంగన్ వాడీల నియామకాలకు కూడా రాత పరీక్ష ఉందని, మార్కులు కూడా ఉంటాయని, కేవలం మెరిట్ ఆధారంగానే ఎంపిక చేస్తారని, అధికారులు చెప్పినప్పటికీ ఖాళీలను మాత్రం తమకు తెలియకుండా భర్తీ చేయవద్దని ఆదేశిస్తున్నారట. వైసీపీ చోటా నేతల హడావుడి చూసి.. అధికారులు.. సామాన్యులు కూడా.. ఆశ్చర్యపోతున్నారు. అవురావురు మంటున్నారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే ఇంత హడావుడి చేస్తున్న వీరు.. నిజంగా.. గెలిస్తే ఇంకెలా వ్యవహరిస్తారోనన్న ఆందోళన ప్రజల్లో కూడా ఉంది.