ఏం చేసినా పంచాయతీ ఎన్నికలు ఆపడం తమ చేతిలో లేదనుకుంటున్న వైసీపీ ఎన్నికలకు ఏర్పాట్లు చేసుకుంటోంది. గ్రామ ప్రాంతాల్లో తమ ప్రభుత్వం వ్యతిరేకత రాకుండా.. ఎక్కడెక్కడ మైనస్‌లు ఉన్నాయో.. అక్కడ సరి చేసుకుంటూ… పెద్ద ఎత్తున జనవరిలోపు నగదు బదిలీ పథకాల అమలుకు రంగం సిద్దం చేసుకుంటోంది. ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో చాలా మంది అసంతృప్తి ఉంది. గత ప్రభుత్వం దాదాపుగా పది లక్షల ఇళ్లను కట్టించింది. అలాట్ చేసింది. కానీ కొత్త ప్రభుత్వం పంపిణీ చేయకుండా నిలిపివేసింది. ఈ అసంతృప్తిని తొలగించడానికి ఇళ్ల పట్టాల పంపిణీని ప్రకటించేసింది. ఇంత కాలం టీడీపీ కేసులేసి అడ్డుకుందని చెబుతూ వచ్చిన ప్రభుత్వం.. ఒక్క సారిగా.. పంపిణీకి ముహుర్తం పెట్టేసరికి జనం ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. దీనికి కారణం పంచాయతీ ఎన్నికలేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని వైసీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.
ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర పైసా నిధుల్లేవు. ఇళ్ల నిర్మాణం సాధ్యం కాదు. కానీ లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభించేస్తామని చెబుతున్నారు. ఇళ్ల పట్టాలిచ్చిన రోజే.. పనులు కూడా ప్రారంభిస్తామంటున్నారు. పంచాయతీ ఎన్నికలు ముగిసవరకూ.. హడావుడి చేయడానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేసుకున్నారు. మరో వైపు నగదు బదిలీ పధకాలకు సంబంధించి జనవరిలోపు లబ్దిదారులకు డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. గ్రామీణ ప్రాంతాల ఓటర్లను ప్రభావిం చేసే అన్ని పధకాలను జనవరిలోపు ప్రారంభించాలని నిర్ణయించారు. పెండింగ్‌లో ప్రారంభోత్సవాలు, భూమిపూజల్ని మంత్రులు, ఎమ్మెల్యేలు చేసేస్తున్నారు.
నిజానికి ఎన్నికలు నిర్వహించకూడదనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది అంతా ఒక్క నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రమే. ఆయన లేకపోతే.. కరోనా లాక్ డౌన్ సమయంలోనే… ఎన్నికలు నిర్వహించేసేవారు. దాని కోసం .. కనగరాజ్‌ను తీసుకొచ్చి పీఠం ఇచ్చారు కూడా. ఇప్పుడు కూడా కుదిరితే మార్చి వరకూ నెట్టుకొచ్చి.. ఆ తర్వాత వేరే కమిషనర్‌ను నియమించి ఎన్నికలు జరపాలనుకుంటున్నారు. నిమ్మగడ్డ ఉంటే ఏకగ్రీవాలు సాధ్యం కాదనో… నిబంధనలు కఠినంగా అమలు చేస్తారనో.. అధికార పార్టీ అనే అడ్వాంటేజ్ లేకుండా పోతుందనో.. వైసీపీ నేతలు కంగారు పడుతున్నారు.