గుంటూరు, కృష్ణ… ఈ రెండూ రాజధాని ప్రాంత జిల్లాలు. దీంతో రాజకీయంగా అధికార, ప్రతిపక్ష పార్టీలకు అత్యంత కీలకమైన ప్రాంతాలు అనడంలో సందేహం లేదు. వచ్చే ఎన్నికలను దృష్టిలోపెట్టుకుని ఇప్పట్నుంచే ఈ జిల్లాల్లో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు పోటీలు చేయబోయే నేతలపై టీడీపీ, వైకాపాలు ప్రత్యేక దృష్టి సారించాయి. ప్రతిపక్ష పార్టీ వైకాపా విషయానికొస్తే… ఈ రెండు జిల్లాల్లోనూ అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తున్నా… పార్లమెంటు స్థానాలకు వచ్చేసరికి ఎవరు అనేదే ప్రశ్నార్థంగా మారినట్టు తెలుస్తోంది! అందుకే, ఎంపీ విజయసాయి రెడ్డి ఇప్పటికే రంగంలోకి దిగారనీ, ఆయా జిల్లాల్లో ప్రముఖ వ్యాపారవేత్తలను బరిలోకి దింపే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. దీంతోపాటు భాజపా, కాంగ్రెస్ నేతలతో కూడా ఆయన మంతనాలు సాగిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఈ రెండు జిల్లాల్లోని ఐదు ఎంపీ స్థానాల్లో అభ్యర్థులు ఎవరనేదానిపై జగన్ మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు జిల్లాల్లోంచి జగన్ పాదయాత్ర సాగినా… దాని ప్రభావం అంతంత మాత్రంగా ఉందనే టాక్ వినిపిస్తోంది! ముఖ్యంగా నేతల్ని ఆకర్షించేంత ప్రభావవంతంగా ఈ ప్రాంతంలో యాత్ర జరగలేదన్న గుసగుసలూ ఉన్నాయి. గత ఎన్నికల్లో కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం నుంచి పార్థసారధి, బెజవాడ నుంచి కోనేరు రాజేంద్రప్రసాద్ పోటీ చేశారు. అయితే, ఈ ఇద్దరికీ మరోసారి అవకాశం అనుమానమే. ఎందుకంటే, కోనేరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట! పార్థసారధి కూడా అడపాడదపా పార్టీ కార్యక్రమాలకు వస్తున్నారట. గుంటూరు జిల్లాలో ఉన్న మూడు ఎంపీ స్థానాల నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన వైకాపా అభ్యర్థులు పార్టీ కార్యక్రమాల విషయానికి వచ్చేసరికి చురుగ్గా లేరనే అభిప్రాయం ఉంది. దీంతో ఈ ఐదు స్థానాలకు కొత్తవారిని ఎంపిక చేయడం పెద్ద ప్రశ్నగా మారుతున్నట్టు సమాచారం.
ఈ జిల్లాల్లో ఎమ్మెల్యే స్థానాల్లో వైకాపా అభ్యర్థుల ఎంపీక చివరి నిమిషమైనా ఖరారు చేసుకోవచ్చన్న అభిప్రాయం పార్టీలో ఉన్నా… ఎంపీల సంగతే త్వరగా స్పష్టత రావాలనే తొందర పార్టీలో కనిపిస్తోంది. అయితే, ఇప్పటికే విజయసాయి రంగంలోకి దిగి కొంతమందితో చర్చలు జరుపుతున్నట్టు కథనాలు ఉన్నా, ఏ పార్టీతో వైకాపా పొత్తు పెట్టుకుంటుంది అనే అంశంపై స్పష్టత ఇస్తే తప్ప, వైకాపా తరఫున తాము బరిలోకి దిగలేమని ఓ ముగ్గురు ప్రముఖ వ్యాపారవేత్తలు స్పష్టం చేశారట. భాజపాతో పొత్తు అనలేరు, పవన్ తో దోస్తీ అని చెప్పలేరు, కాంగ్రెస్ కలిసే పరిస్థితి లేదు! వీటిలో ఏ ఆప్షన్ ఉందని చెప్పుకున్నా… వైకాపాకి మరింత మైనస్ కావడం ఖాయమనేది వారికి తెలిసిన వాస్తవమే. దీంతో రాష్ట్రంలో అత్యంత కీలకమైన జిల్లాలైన గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వైకాపాలో ప్రముఖ నేతల కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.