ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు .. ఎప్పుడో నాలుగు దశాబ్దాల కిందట ఏపీ నుంచి ఢిల్లీ వెళ్లిపోయి అక్కడే స్థిరపడ్డారు. ఆయన ఆస్తులు.. వ్యాపారాలు… వ్యవహారాలు అన్నీ ఢిల్లీ.. యూపీలోనే. కానీ రాజకీయాలు మాత్రం ఏపీలో చేస్తున్నారు. రాజ్యసభ సభ్యత్వం ముగిసిపోతున్న సమయంలో వచ్చే ఎన్నికల్లో ఆయన విశాఖ నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని ఆసక్తిగా ఉన్నారు. ఇది పార్టీ నిర్ణయమో లేకపోతే.. మరొకటో కానీ.. ఆయన ఉంటే ఢిల్లీ లేకపోతే విశాఖ అన్నట్లుగా రాజకీయం చేస్తున్నారు.
తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభ విషయంలోనూ ఆయన తనకు తాను గొప్పతనం ఆపాదించుకుని చెప్పుకుంటున్నారు. విశాఖలో సభ ఏర్పాటు కావడానికి తానే కారణం అని జీవీఎల్ చెప్పుకుంటున్నారు . ప్రధానమంత్రికి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేశానని అందుకే సభ కు రావడానికి అంగీకరించారని అంటున్నారు. మరి అంతగా పట్టుబట్టి సభకు రావడానికి ప్రధానితో అంగీకరింపచేస్తే… ఆ సభను వైసీపీకి ఎందుకు అంకితం చేశారన్నది మాత్రం జీవీఎల్ చెప్పడం లేదు. పూర్తిగా వైసీపీ కనుసన్నల్లో జరిగిన ఈ సభలో బీజేపీ నేతల పాత్ర నామమాత్రం . వారు రోడ్ షో మాత్రం నిర్వహించారు. కనీసం ఓ కార్యకర్తల సమావేశం పెట్టించలేకపోయారు.
వచ్చే ఎన్నికల్లో జీవీఎల్‌కు.. విశాఖ లోక్‌సభ స్థానంపై వైసీపీ హైకమాండ్‌పై హామీ ఇచ్చినట్లుగా ఉందన్న అభిప్రాయం బీజేపీలోనే వినిపిస్తోంది. ఎన్నికల నాటికి బీజేపీతో పొత్తు పెట్టుకుంటారని.. విశాఖ స్థానాన్ని జీవీఎల్‌కు కేటాయిస్తారని వారు అనుమానిస్తున్నారు. పొత్తుల్లేకపోతే బీజేపీకి డిపాజిట్ దక్కడం కష్టం. అయినా జీవీఎల్ ఓ ప్రత్యేకమైన ఆశతోనే అక్కడ రాజకీయం చేస్తున్నారని.. అదేమిటో స్పష్టత రావాల్సి ఉందంటున్నారు.