కడప ఉక్కు కర్మాగారం సాధన దిశగా టీడీపీ ఎంపీ సీఎం రమేష్ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఉద్యమాన్ని మొదట్నుంచీ వైకాపా నేతలు ఎద్దేవా చేస్తూ వచ్చారు. దొంగ దీక్షలంటూ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. గడచిన నాలుగేళ్లుగా ఏం చేశారంటూ ఉల్టా ప్రశ్నించారు. అంతేగానీ, ఈ క్రమంలో వైకాపా చేస్తున్న పోరాటం ఏంటనే కోణాన్ని మాత్రం వదిలేశారు. జగన్ కూడా ఉక్కు ఉద్యమం గురించి మాట్లాడిందీ లేదు. దీంతో వైకాపా తీరుపై విమర్శలు పెరిగేసరికి.. ఇప్పుడు తత్తరపాటు పడుతున్నారు. ఉక్కు ఉద్యమాన్ని ఓన్ చేసుకుని, తమకూ చిత్తశుద్ధి ఉందనే అభిప్రాయం కలిగించడం కోసం అవస్థలు పడుతున్నారు.
ఉక్కు పిడికిలి బిగించామన్నట్టుగా వైకాపా నేతలు ఇప్పుడు మాట్లాడుతున్నారు. కడప జిల్లా వ్యాప్తంగా తాము బంద్ కి పిలుపునిస్తే… ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారంటూ వైకాపా చెబుతోంది. వైకాపా ఆధ్వర్యంలో ఎక్కడిక్కడ నిరసనలు మిన్నంటాయని ప్రచారం చేస్తున్నారు! అఖిల పక్షం ఆధ్వర్యంలో కడప జిల్లాలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. జనసేనతోపాటు వామపక్షాలు కూడా ముందుకు కదిలాయి. అయితే, ఇవన్నీ టీడీపీ చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా చూపడం పోయి.. ఇదంతా తమ క్రెడిట్ అని చెప్పుకునేందుకు వైకాపా ప్రయత్నిస్తూ ఉండటం హాస్యాస్పదం. విచిత్రం ఏంటంటే… కడపలో వైకాపా బంద్ నిర్వహిస్తే, దీనికి తెలుగుదేశం పార్టీ దూరంగా ఉండటంపై తీవ్ర చర్చకు దారితీసిందంటూ సాక్షి పేర్కొంది. ఉక్కు పరిశ్రమ కోసం దీక్ష చేస్తున్న టీడీపీ, అఖిలపక్షం ఇచ్చిన బంద్ పిలుపునకు స్పందించకపోవడం విస్మయాన్ని కలిగించిందనీ, జిల్లాలో ఏ ప్రాంతంలోనూ టీడీపీ కార్యకర్తలు బంద్ లో పాల్గొనలేదని సాక్షి పేర్కొంది.
ఉన్నట్టుండి ఉక్కు ఉద్యమాన్ని ఓన్ చేసుకునే హడావుడిలో పడింది వైకాపా! నిన్నమొన్నటి వరకూ నేతలంతా టీడీపీ చేస్తున్న పోరాటాన్ని తప్పుబడుతూ వచ్చినవారే. కానీ, ఇప్పుడేమో తాము చేస్తున్న పోరాటానికి టీడీపీ మద్దతు ఇవ్వలేదని ఉల్టా చర్చ మొదలుపెట్టారు. నిజానికి, ఉక్కు దీక్షను మొదట ప్రారంభించిందే టీడీపీ ఎంపీ సీఎం రమేష్. ఎంపీలు ఢిల్లీ వెళ్లడం, కేంద్రమంత్రిని కలవడం, ఆయన నేరుగా సీఎం రమేష్ కు ఫోన్ చేయడం… ఇవన్నీ అయ్యాక ఇప్పుడు వైకాపా హడావుడి మొదలుపెట్టింది! రాష్ట్ర ప్రయోజనాల కోసం అధికార పార్టీ కేంద్రంతో పోరాడుతుంటే… దాన్ని అనుసరించాల్సింది పోయి, తమను టీడీపీ ఫాలో కావడం లేదంటూ వైకాపా నేతలు విమర్శిస్తుంటే ఏమనుకోవాలి..? గత పార్లమెంటు సమావేశాల్లోనూ ఇలాగే వ్యవహరించారు కదా. నిజంగానే రాష్ట్ర ప్రయోజనాలపై చిత్తశుద్ధి ఉంటే టీడీపీ చేస్తున్న ప్రయత్నానికి మద్దతుగా నిలవాలి. అంతేగానీ… జాతీయ స్థాయిలో మరోసారి టీడీపీ చేస్తున్న ఉద్యమానికి ప్రాధాన్యత లభిస్తున్న వేళ.. వైకాపా కూడా మరోసారి కేంద్రంపై ఒత్తిడిని పెరగనీయకుండా గాలి తీసే ప్రయత్నంగానే ఆ పార్టీ తీరు కనిపిస్తోంది.