ఎక్కడైనా విపక్షాలు … అధికార పార్టీ నేతల ఇళ్లను ముట్టడించి.. తమ డిమాండ్లను పరిష్కరించాలనే డిమాండ్లు చేస్తూంటాయి. కానీ విచిత్రంగా.. ఏపీలో అధికార పార్టీ విపక్షాల ఇళ్లను ముట్టడిస్తోంది. విపక్షాల శిబిరాల మీద దాడి చేస్తోంది. కాగడాలు పట్టుకుని వచ్చి తగులబెట్టేస్తామని హెచ్చరికలు చేస్తోంది. మొన్నటికి మొన్న తెనాలిలో అమరావతి జేఏసీ ఏర్పాటు చేసిన శిబిరంపై వైసీపీ నేతలు దాడులు చేసి నిప్పు పెట్టారు. ఆ వ్యవహారం ఇంకా చర్చల్లో ఉండగానే.. టీడీపీ నేతల ఇళ్లపైకి.. వైసీపీ కార్యకర్తలు దాడులు చేయడం ప్రారంభించారు. విశాఖలో గత వారం ఎమ్మెల్సీ బుద్దా నాగ జగదీశ్వరరావు ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం సంచనలం సృష్టించింది. పులివెందుల ఫ్యాక్షన్ సంస్కృతి వైజాగ్ కు తీసుకొచ్చారని టీడీపీ నేతలు మండిపడ్డారు.
ఇప్పుడు.. వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఇంటిపైకి కాగడాలతో వెళ్లారు. పెద్ద ఎత్తున ఓ ప్రణాళిక ప్రకారం.. కార్యకర్తల్ని కూడదీసుకుని వెళ్లడం కలకలం రేపుతోంది. పోలీసులు కూడా వైసీపీ నేతల ఆందోళనలను చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు . విశాఖ గుంటూరులోనే కాదు.. అనంతపురం జిల్లా హిందూపురంలోనూ వైసీపీ నేతలు… బాలకృష్ణను అడ్డుకున్నారు. ఓ ప్రణాళిక ప్రకారం.. టీడీపీ నేతలను అడ్డుకునే కార్యక్రమాలను.. చేస్తున్నారని.. అధికార పార్టీగా ఉండి.. ఇదేం పద్దతన్న విమర్శలు టీడీపీ నుంచి వస్తున్నాయి. అధికార పార్టీగా ఉండి.. లా అండ్ ఆర్డర్ ను కాపాడాల్సిన పార్టీనే… ప్రతిపక్ష పార్టీ నేతల ఇళ్ల ముట్టడికి ప్రయత్నించి.. అలజడి రేపే ప్రత్నం చేయడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
అమరావతి రాజధాని కోసం పోరాడుతున్న వారే.. వైసీపీ నేతల ఇళ్ల ముట్టడికి ప్రయత్నించకుండా.. తమ నిరసనలు తాము చేసుకుంటున్నారు. అసలు సంబంధమే లేని.. హిందూపురం లో వైసీపీ కార్యకర్తలు.. బాలకృష్ణను అడ్డుకోవడం దేనికోసమో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఓ ప్రణాళిక ప్రకారం.. ఏపిలో ఉద్దేశ పూర్వక అలజడి రేపితే.. మిగిలిన విషయాలన్నీ డైవర్ట్ అయిపోతాయన్న వ్యూహం… అధికార పార్టీ అమలు చేస్తోందన్న అభిప్రాయం అంతటా వ్యక్తం చేస్తోంది.