చంద్రబాబు పంచాయతీ ఎన్నికల కోసం ఓ మేనిఫెస్టో విడుదల చేశారు. పంచసూత్ర అని దానికి పేరు పెట్టారు. దాన్ని ఇతరులెవరైనా పట్టించుకున్నారో లేదో కానీ.. వైసీపీ నేతలు మాత్రం నెత్తిన పెట్టుకుంటున్నారు. ఆయన మేనిఫెస్టో విడుదల చేసినప్పటి నుండి … అదే పనిగా విమర్శిస్తున్నారు. ఒకరు పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో ఏమిటంటి అని అంటే.. అసలు మేనిఫెస్టో విడుదల చేయడం రాజ్యాంగ విరుద్ధమని అంటున్నారు. చివరికి ఎంపీలు కూడా అదే మాట చెప్పారు. చంద్రబాబు ఘోరమైన రాజ్యాంగ తప్పిదానికి పాల్పడినట్లుగా తేల్చుతున్న నేతలు.. మరి ఈసీకి ఫిర్యాదు చేస్తారా అంటే… నిమ్మగడ్డ సుమోటోగా చర్యలు తీసుకోవాలని మొదట డిమాండ్ చేశారు. చివరికి ఫిర్యాదు చేయకపోతే ఏం బాగుంటుందని పార్టీ తరపున పని లేని ఓ లాయర్ అయిన నాయకుడ్ని పంపించారు. ఆయన రాసుకొచ్చిన లేఖ మరీ విచిత్రంగా ఉంది.
ఎస్ఈసీకి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తూ ఆయనపైనే ఆ ఫిర్యాదులో విమర్శలు గుప్పించారు. చంద్రబాబుపై చర్యలు తీసుకుని మీరు పక్షపాతం లేకుండా వ్యవహరిస్తున్నానని రుజువు చేసుకోవాలని లేఖలో చివరిగా టెస్టు కూడా పెట్టారు. సాయిరాం అనే ఆ వైసీపీ నేతల లేఖ చూసి చాలా మంది అధికారం తలకెక్కితే ఇలాగే ఉంటుందని అనుకోవాల్సి వచ్చింది. ఇంత చేసినా అసలు చంద్రబాబు మేనిఫెస్టో రిలీజ్ చేయడం ఎలా తప్పో… ఎవరూ చెప్పలేదు. పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తుల మీదుగా జరగవు. కానీ పార్టీ మద్దతు దారుల మధ్యనే జరుగుతాయి. చంద్రబాబు అదే చెప్పి.. టీడీపీ మద్దతుదారుల్ని గెలిపిస్తే ఫలానా పనులు చేస్తామని పత్రాన్ని రిలీజ్ చేశారు.
అలా రిలీజ్ చేయకూడదని ఏ చట్టంలోనూ లేదు. కానీ ఏదో ఓ నిబంధన ఉల్లంఘించారన్న అభిప్రాయాన్ని కల్పించి… నిమ్మగడ్డ టీడీపీపై చర్యలు తీసుకోవడం లేదన్న ప్రచారం చేయడానికి ఈ మేనిఫెస్టో అంశాన్ని వైసీపీ హైలెట్ చేస్తోందన్న చర్చ జరుగుతోంది. ఇతర ఉల్లంఘనలు ఏమైనా ఉంటే ఫిర్యాదు చేస్తే.. నిమ్మగడ్డ చర్యలు తీసుకోకపోతే.. ఆరోపణలు చేయవచ్చు కానీ.. మేనిఫెస్టో విడుదల చేసినా… రాజ్యాంగ విరుద్ధమనడం ఏమిటన్న చర్చ సహజంగానే అందరిలోనూ నడుస్తోంది. కానీ వైసీపీ నేతలు ఏదనుకుంటే అది … ప్రచారం చేసేస్తారు. వారి పార్టీ అభిమానులు నమ్మేస్తారని టీడీపీ నేతలు అంటున్నారు.