ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎన్నికల సంఘం ప్రవర్తిస్తున్న తీరు అత్యంత వివాదాస్పదంగా ఉందన్న విమర్శలు వస్తున్నా… ఈసీ మాత్రం డోంట్ కేర్ అంటోంది. అనేక అనుమానాలు పెరిగేలా.. కొత్త కొత్త కార్యకలాపాలు చేపడుతోంది. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే… రాజంపేట ఎంపీ అభ్యర్థి మిధున్ రెడ్డి… శనివారం సాయంత్రం.. సీఈవో ద్వివేదీని కలుసుకున్నారు. గంట పాటు ఆయన ఒక్కరే… ద్వివేదీతో చర్చలు జరిపారు. ఇతరులను లోపలికి అనుమతించలేదు. పైగా బయట ఓ వైసీపీ నేత కాపలా కూర్చున్నారు. ఈ భేటీ రాజకీయవర్గాల్లో కలకలం రేపింది.
సీఈవోను.. వివిధ రకాల ఫిర్యాదులతో … అన్ని పార్టీల నేతలూ కలుస్తూంటారు. సీఈవో అందరికీ అవకాశం ఇస్తూంటారు కూడా. అయితే.. పోలింగ్ ముగిసిన తర్వాత ఎవరూ పెద్దగా ఫిర్యాదులతో వెళ్లడం లేదు. ఆ అవసరం లేదు కూడా. కానీ వైసీపీ నేతలు మాత్రం దీనికి మినహాయింపు. దాదాపుగా ప్రతీ రోజూ.. ఏదో ఓ ఫిర్యాదుతో ఈసీని కలుస్తూ ఉంటారు. అలాగే.. నిన్న … ద్వివేదీని… మిథున్ రెడ్డి కలిశారని అనుకున్నారు. ఏ ఫిర్యాదు అయినా… ద్వివేదీ.. తీసుకుని ఐదునిమిషాల్లో పంపిస్తారు. కానీ… ఇక్కడ మాత్రం మిథున్ రెడ్డి.. ఏ ఫిర్యాదు చేశారో… దేనిపై ఫిర్యాదు చేశారో కనీసం మీడియాకు చెప్పలేదు. గంట సేపు… దేనిపై చర్చించారో కూడా క్లారిటీ లేదు. వైసీపీ చెప్పినట్లే ఈసీ చేస్తోందని టీడీపీ విమర్శలు చేస్తున్న సమయంలో.. ద్వివేదీ- మిధున్ రెడ్డి భేటీపై… ఆ పార్టీ నేతలు ఎందుకు ఊరుకుంటారు..?
పలు చోట్ల స్ట్రాంగ్‌రూముల సీసీ కెమెరాలు అర్థరాత్రి సమయంలో ఆగిపోతున్నాయన్న సమాచారం బయటకు వస్తోంది. నాగార్జున యూనివర్శిటీలో మూడు రోజుల్లో రెండు సార్లు.. వేర్వేరు నియోజకవర్గాల ఈవీఎంలు భద్ర పరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద రెండు గంటల పాటు సీసీ కెమెరాలు పని చేయలేదు. దీనిపై టీడీపీ నేతలు .. ద్వివేదీకి ఫిర్యాదు చేస్తే.. కరెంట్ సరఫరాలో సమస్య వచ్చిందని వివరణ ఇచ్చారు. మరో వైపు… కౌంటింగ్ ఏర్పాట్లపై… సీఎస్ సమీక్ష చేయడం… ఈ తరుణంలోనే.. వైసీపీ నేతలు.. ద్వివేదీతో రహస్య మంతనాలు చేస్తూడంటంతో… సహజంగానే టీడీపీ నేతలు.. కుట్ర కోణాన్ని బయటకు తెస్తున్నారు.