రాజ్యసభ అభ్యర్థులుగా వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబూరావు పేర్లను ఖరారు చేశారు. ఇద్దరు రెడ్డి సామాజికవర్గం, ఓ ఎస్సీ నేతకు అవకాశం కల్పించాలని జగన్ నిర్ణయించారు. ఇంతకు ముందు చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు ఖరారు చేశారు. రాయలసీమలో బలిజ వర్గానికి చెందిన నేతకు టిక్కెట్ నిరాకరించారు. ఆయనకు బదులుగా చిత్తూరులో రెడ్డి వర్గానికి చెందిన ఎర్రచందనం స్మగ్లర్ విజయానంద రెడ్డికి టిక్కెట్ కేటాయించారు. ఈ కారణంగా ఆయనకు రాజ్యసభ ఇస్తారనుకున్నారు.
కానీ చివరి క్షణంలో కడప జిల్లా రాజంపేటకు చెందిన రఘునాథరెడ్డికి కేటాయించారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకు టిక్కెట్ నిరాకరించి ఆయన సోదరుడికి రాజ్యసభ సీటిస్తున్నారు. అయితే దళిత నేత గొల్ల బాబూరావుకు సీటు కేటాయించడం వెనుక కూడా కుట్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టిక్కెట్లు దక్కని పలువురు ఎమ్మెల్యేలు .. టీడీపీ నిలబెట్టే అభ్యర్థికి ఓటేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎక్కువ మంది రిజర్వుడు నియోజకవర్గాల వారికి టిక్కెట్లు మారుస్తున్నారు. ఈ కారణంగా టీడీపీ దళిత అభ్యర్థిని పోటీకి పెడితే వారంతా దళిత ఎమ్మెల్యేలంతా టీడీపీ అభ్యర్థికి ఓటేస్తారన్న అంచనాలు ఉన్నాయి.
అందుకే దళిత నేత గొల్ల బాబూరావుకు టిక్కెట్ ఖరారు చేసి.. ఓటింగ్ లో దళిత ఎమ్మెల్యేలను ఆయనకు కేటాయించే అవకాశాలు ఉన్నాయి… ఒక వేళ ఓడిపోతే దళిత నేతే కాబట్టి లైట్ తీసుకుంటారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. పార్టీకి విధేయంగా ఉన్న వారి ఓట్లు గొల్లబాబురావుకు కేటాయించి.. టిక్కెట్ నిరాకరించిన వారి ఓట్లు రెడ్డి వర్గంలోని వారికి కేటాయించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.