వైసీపీ రాజ్యసభ సభ్యుల పేర్లలో తాజాగా ఆర్.కృష్ణయ్య పేరు వచ్చి చేరింది. విజయసాయిరెడ్డితో పాటు టీడీపీ నుంచి వచ్చి చేరిన బీద మస్తాన్ రావు, జగన్ అక్రమాస్తుల కేసులు వాదించే లాయర్ నిరంజన్ రెడ్డితో పాటు నాలుగో పేరుగా ఆర్.కృష్ణయ్యను చేర్చారు. ఆయన వైసీపీ సభ్యుడు కాదు. ఆయనతో పాటు నిరంజన్ రెడ్డి కూడా వైసీపీ సభ్యుడు కాదు. ఇద్దరికీ ఇప్పుడు సభ్యత్వం ఇచ్చి వెంటనే రాజ్యసభ పదవి ఇవ్వాల్సి ఉంది. సీనియర్ నేతలతో సమావేశమైన జగన్ ఈ నాలుగు పేర్లకు ఆమోదముద్ర వేసినట్లుగా వైసీపీ వర్గాలు మీడియాకు సమాచారం ఇచ్చారు.
రాజకీయాల్లో అదృష్టమంటే ఆర్. కృష్ణయ్యదే. బీసీ సంక్షేమ సంఘం అనే బోర్డు పెట్టుకుని ఆయన చేస్తున్న రాజకీయానికి అన్ని పార్టీలు పిలిచి మరీ పదవులిస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ప్రయోగం చేద్దామని బీసీ సీఎం నినాదంతో సీఎం అభ్యర్థిగా ప్రకటించి మరీ చంద్రబాబు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చి గెలిపించారు. కానీ ఆయన సీఎం ఆశలు గల్లంతు కావడంతో టీడీపీ అవసరం లేదనుకున్నారు. ఆ తర్వాత గత ఎన్నికల నాటికి కాంగ్రెస్లో చేరి మిర్యాలగూడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయిన దగ్గర ఉండటం ఎందుకని మళ్లీ కాంగ్రెస్ వైపు చూడలేదు. తర్వాత ఉపఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు పలికారు. ఇటీవల సొంత పార్టీ పెట్టుకుంటానని తెలంగాణలో తిరుగుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీకి మద్దతుగా ప్రచారం చేశారు. ప్రతిఫలంగా ఇస్తున్నారో.. లేక ఇంకేమైనా ఉందో కానీ ఆయనకూ అనూహ్యంగా జగన్ చాన్సిస్తున్నారు.
మరో వైపు లాయర్ నిరంజన్ రెడ్డి పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. రెండు రెడ్డి, రెండు బీసీ నేతలకు చాన్సిచ్చినట్లవుతుంది. ఇందులో తెలంగాణకు చెందిన బీసీ నేత ఆర్.కృష్ణయ్య ఒకరు. సొంత పార్టీ నేతల్లో చాలా మంది ఆశావహులు ఉండగా.. ఎక్కడో తెలంగాణ నుంచి తీసుకొచ్చి ఆర్.కృష్ణయ్యకు చాన్సివ్వడం ఏమిటన్న చర్చ వైసీపీలో ప్రారంభమయింది.