ప్రతిపక్ష పార్టీ అంటే ప్రజల పక్షాన నిలబడాలి. ప్రజల గొంతును వినిపించాయి. కానీ, ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష వైకాపాకి అలాంటి బాధ్యత లేదు. ఉంటే.. రాష్ట్ర క్లిష్టపరిస్థితుల్లో ఉన్న ఇలాంటి సమయంలో కూడా అసెంబ్లీకి గైర్హాజరు అయ్యేవారు కాదు. అలాంటి బాధ్యతే ఉంటే… కేంద్రంలో అధికార పార్టీ చేసే పోరాటానికి మద్దతు తెలిపేవారు.ఆ స్థాయి ఆశించకపోయినా.. కనీసం ఈ తరుణంలో ఇలాంటి విమర్శలు చెయ్యకుండా ఉండేవారు..! అదే ఉంటే, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం తాము చేస్తున్నదే పోరాటమనీ, అధికార పార్టీ చేస్తున్నదంతా డ్రామా అన్నట్టుగా వ్యాఖ్యానాలు చేసి ఉండేవారు కాదు.
కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీ మంత్రులు వైదొలుగుతున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం ప్రకటిస్తే… దానిపై విమర్శలు చేశారు వైపీసీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. మంత్రులతో రాజీనామా చేయించడం ఒక డ్రామా అన్నారు. టీడీపీ, భాజపాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నాయన్నారు. కేంద్రమంత్రి వర్గం నుంచి మాత్రమే టీడీపీ తప్పుకుంటోందనీ, అంతేగానీ ఎన్డీయేతో తెగతెంపులు చేసుకుంటున్నట్టు చంద్రబాబు ప్రకటించకపోవడం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం అన్నారు. కేంద్రంపై తాము త్వరలోనే అవిశాస తీర్మానం పెడతామనీ, ఆ తరువాత రాష్ట్ర ప్రయోజనాల కోసం వైకాపా ఎంపీలు రాజీనామాలు చేస్తారని ప్రకటించారు. మరో నేత బొత్స సత్య నారాయణ మాట్లాడుతూ… కేంద్రం ఇంత నిర్లక్ష్యం చేస్తుంటే చంద్రబాబులో ఏమాత్రం పరివర్తనా పశ్చాత్తాపం లేదన్నారు. ప్రత్యేక హోదా కోసం జగన్ పోరాటం చేస్తుంటే, టీడీపీ కోటరీ ఎద్దేవా చేస్తోందన్నారు. ప్రత్యేక హోదా కోసం తాము ఎంత దూరమైనా వెళ్తామన్నారు..!
ప్రతిపక్ష పార్టీ నేతల వ్యవహార శైలి ఇలా ఉంది..! నిన్నటి వరకూ టీడీపీ మంత్రులు రాజీనామాలు చెయ్యాలీ చెయ్యాలీ అని గగ్గోలుపెట్టిందీ వారే..! రాజీనామాలు చాలవూ ఎన్డీయే నుంచి కూడా బయటకి వచ్చేయాలని ఇప్పుడు అంటున్నదీ వారే..! కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం పోరాటానికి దిగుతున్న ఇలాంటి సమయంలో వీలైతే మద్దతు ఇవ్వండి, ఇష్టం లేదా.. మౌనంగా ఉండండి, మర్యాదైనా దక్కుతుంది. మంత్రుల రాజీనామాలు ‘తొలి అడుగు’ అని ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా ప్రకటించారు. అంటే దానర్థం… ‘మంత్రులు రాజీనామా చేసినా పొత్తు కొనసాగుతుందీ’ అని చెప్పినట్టు కాదు. వైకాపా ఎంపీలు ఎప్పుడు రాజీనామాలు చేసినా చెయ్యకపోయినా రాష్ట్రానికి పెద్దగా ఫరక్ ఉండదు. కేంద్రంతో టీడీపీ తెగతెంపులు ఇక్కడ సమస్య కాదు… కేంద్రం నుంచి ప్రయోజనాలు రాబట్టుకోవడం టీడీపీ ముందున్న లక్ష్యం. కాబట్టి, అన్ని రకాల ప్రయత్నాలు చెయ్యాలి. ఈ పోరాటంలో రాష్ట్ర ప్రయోజనాల కోణం అనేది ఒకటి ఉంటుందన్న సూక్ష్మం వైకాపాకి ఎప్పటికీ అర్థం కాదు.