చంద్రబాబునాయుడు మంత్రి వర్గ విస్తరణకు సంబంధించిన సంకేతాలు ఇచ్చినప్పటినుంచి రకరకాల ఊహాగానాలు పార్టీలో పెరిగిపోయాయి. అన్నిటినీ మించి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనుంచి పార్టీలో చేరుతున్న వారికి ఎన్ని పదవులు పంచబోతున్నారనేది చాలా కీలకమైన అంశంగా మారుతోంది. ఫిరాయింపు దార్లకు పెద్దపీట వేస్తే.. పార్టీనే నమ్ముకుని పనిచేస్తున్న వారిలో చిత్తశుద్ధి పలచన అవుతుందనే భయం కూడా పార్టీకి చెందిన కొందరు సీనియర్లలో ఉంది.
రకరకాల ఊహాగానాల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనుంచి తెదేపాలో చేరిన పదిమందిలో నలుగురికి మంత్రివర్గంలో చాన్స్ దక్కవచ్చుననే ప్రచారం ముమ్మరంగా నడుస్తోంది. నిజానికి వైకాపా నుంచి ఫిరాయించిన వారికి చాలా పెద్ద వాటాలో పదవులు పంచేస్తున్నట్లే లెక్క అని కినుక వహిస్తున్న పాత నాయకులు కూడా ఉన్నారు.
చంద్రబాబునాయుడు త్వరలోనే ముస్లిం మంత్రి కూడా కేబినెట్లో ఉంటారని ప్రకటించిన నేపథ్యంలో జలీల్‌ఖాన్ కు బెర్తు ఖరారు అని అంతా అనుకుంటున్నారు. ఇక పోతే వైకాపానుంచి వచ్చిన వారిలో ఒక ఎస్సీకి కూడా చోటు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీనియర్లు, పవర్ఫుల్ నాయకులు అయిన భూమా నాగిరెడ్డి, జ్యోతుల నెహ్రూలు కూడా మంత్రిపదవికి గట్టిగా పోటీపడుతున్నట్లే లెక్క. ఈ కోణంలోంచి చూసినప్పుడు నలుగురికి పదవులు గ్యారంటీ అని ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం కాబినెట్లో 6 ఖాళీలు ఉన్నాయి. ఈ నలుగురిని మినహాయిస్తే.. రెండే ఖాళీలు ఉంటాయి. తెదేపా వారికి చోటు కల్పించాలంటే.. ఆశావహులు ఎక్కువే ఉన్నారు. వారిని సంతుష్టుల్ని చేయాలంటే.. ప్రస్తుతం కేబినెట్లో ఉన్న కొందరిపై వేటు తప్పదనే ప్రచారం కూడా జరుగుతోంది.