భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదన్నారు వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి. కడప జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ విషయం స్పష్టం చేశారు. రాయలసీమకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిందేమీ లేదని విమర్శించారు. ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత కేవలం కాలయాపన మాత్రమే జరిగిందని, అభివృద్ధి జరగలేదన్నారు. కడప ఉక్కు కర్మాగారం గురించి మాట్లాడుతూ… వైయస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే, ఈపాటికి స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు అయిపోయి ఉండేదన్నారు. జగన్ ముఖ్యమంత్రి కాగానే, వెంటనే కడప ఉక్కు కర్మాగారం నెలకొల్పుతామన్నారు. చంద్రబాబు హయాంలో నిధుల దుర్వినియోగం విచ్చలవిడిగా జరుగుతోందన్నారు. తాము అధికారంలోకి రాగానే, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డవారిపై కఠినమైన చర్యలు ఉంటాయన్నారు. రెవెన్యూ, కలెక్టర్లు, పోలీసుల… ఇలా అధికార యంత్రాంగమంతా టీడీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విజయసాయి ఆరోపించారు.
భాజపాతో పొత్తు ఉండదని వైకాపా చెప్పడం కొత్త విషయమేమీ కాదు. ఆ సంగతి ఆంధ్రాలో అందరికీ తెలిసిందే. ఎందుకంటే, భాజపాకి ప్రస్తుతం ఏపీలో ఉన్న ఇమేజ్ అలాంటిది! రాష్ట్ర విభజన తరువాత, అన్ని రకాలుగా ఆదుకుంటామని నమ్మబలికి, నాలుగేళ్లు కాలయాపన చేసి… ఇచ్చిన హామీలను, చట్టబద్ధంగా రావాల్సిన కేటాయింపుల్ని సైతం భాజపా అటకెక్కించేసింది. రాజధాని నిర్మాణం, ప్రత్యేక హోదా, పన్నుల రాయితీలు, రెవెన్యూ లోటు భర్తీ… ఇలా అన్నింటా ఆంధ్రాను మోసం చేసింది. దీంతో భాజపాపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇలాంటి సమయంలో… ఆ పార్టీతో దోస్తీ కట్టేందుకు ఎవరూ ముందుకొచ్చే పరిస్థితి లేదు. కాబట్టి, వైకాపా కూడా దూరంగానే ఉంటుంది.
అయితే, ఎన్నికల తరువాత కేంద్రంలో భాజపాకి వైకాపా మద్దతు ఇవ్వడం ఖాయమనే అభిప్రాయం కూడా బలంగానే ఉంది. దానికి కారణం ఆ పార్టీ పట్ల వైకాపా అనుసరిస్తున్న వైఖరే. ఆంధ్రా ప్రయోజనాల అంశమై కేంద్రాన్ని ధీటుగా వైకాపా నిలదీసిన సందర్భాలు లేవు. పార్లమెంటులో ఏపీ ఎంపీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంలో కూడా భాజపాకి అనుకూలమైన పరిస్థితులు ఉండే విధంగా పరోక్షంగా వైకాపా వ్యవహరించిన తీరును ప్రజలు గమనించారు. రాష్ట్ర స్థాయిలో చేస్తున్న పోరాటాలు కూడా అలానే ఉన్నాయి.
సరే.. ఇప్పుడు పొత్తు లేదని విజయసాయి చెబుతున్నారు, బాగానే ఉంది! కనీసం ఇక నుంచైనా కేంద్రంతో పోరాటం తీవ్రతరం అవుతుందని బలంగా చెప్పలేకపోతున్నారు. వైయస్ బతికి ఉండే నిన్ననే కడప ఉక్కు కర్మాగారం వచ్చేదీ, జగన్ ముఖ్యమంత్రి అయితే రేపే వచ్చేస్తుందని అంటున్నారేగానీ… ఈరోజున జగన్ చేయాల్సిన పోరాటం గురించి ఎందుకు మాట్లాడరు..? కాబట్టి, భాజపాతో స్నేహం ఉండదని ఎంత బలంగా చెప్పినా… ఎన్నికల తరువాత వారూ వీరూ భాయీ భాయీ అనే అభిప్రాయం అంతకంటే బలంగానే ఉందన్నది వాస్తవం.