వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక కసరత్తులో టిక్కెట్ రాని వాళ్లు ఓ రోజు బాధపడి రియలైజ్ అవుతున్నారు. కానీ టిక్కెట్ పొందిన వారు మాత్రం నిత్య నరకం అనుభవిస్తున్నారు. వారు ఓడిపోతారని చెప్పే వేరే నియోజకవర్గానికి పంపారని ప్రజల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. చిలుకలూరిపేటలో ఎన్నో ఘనకార్యాలు చేస్తే అక్కడ ఓడిపోతారని తెలిసి గుంటూరుకు మార్చారని.. ఇక్కడెం వెలగబెడతారని.. గుంటూరు పశ్చిమలో విడదల రజనీపై చర్చలు జరుగుతున్నాయి. సీటు మారిన అందరిపైనా ఇదే తరహా చర్చలు జరుగుతున్నాయి.
నియోజకవర్గాల మార్పులకు గురైన ఎమ్మెల్యేలు, మంత్రులు సొంత నియోజకవర్గాల్లో చాలా ఘనకార్యాలు వెలగబెట్టారని అక్కడ వారు ఓడిపోతారనే.. నియోజకవర్గాలు మార్చాలని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. సొంత నియోజకవర్గాల్లో వారు ప్రజలను పీడించుకుని తిన్నారని ఇప్పుడు.. కొత్త నియోజకవర్గంలో అదే పని చేస్తారని అంటున్నారు. ఈ ప్రచారాన్ని కొత్తగా నియోజకవర్గానికి వస్తున్న నేతలు తిప్పికొట్టలేకపోతున్నారు. తమను ఎందుకు మార్చారంటే ఏమీ చెప్పలేకపోతున్నారు. సామాజిక సమీకరణాలు అని చెప్పినా.. గతంలో గెలిచిన చోట సహకరించిన సామాజిక సమీకరణాలు కొత్తగా ఎందుకు వ్యతిరేకమవుతున్నాయన్న ప్రశ్న వస్తుంది.
అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా నేతలకు నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉన్నందునే మారుస్తున్నారన్న ప్రచారాన్ని ఉద్ధృతంగా చేస్తున్నారు. దీంతో నియోజకవర్గాలు మారుతున్న ఎమ్మెల్యేలు.. ఇక ఓటమి ఖాయమనే ఆ నియోజకవర్గానికి వచ్చారన్న అభిప్రాయానికి వస్తున్నారు. ఇది వారికి పెను సమస్యగా మారుతోంది. మరో వైపు నియోజకవర్గాలు మారి వస్తే.. సహకరించేందుకు సొంత పార్టీ నేతలు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో కొత్త నియోజకవర్గంలో క్యాడర్ లేకుండా పోరాటం చేయాల్సి వస్తోంది.