కేంద్రంపై తాము యుద్ధం చేస్తున్నామని చెప్పుకునేందుకు వైసీపీ నేతలు ఇటీవలి కాలంలో ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతకు ముందు సీఎం జగన్ ఒక్క మాట కూడా మాట్లాడేవారు కాదు. ప్లీజ్..ప్లీజ్ అనేది ఆయన విధానం. ఇప్పుడు కూడా అదే. అయితే ఆయన ఇప్పుడు ప్లీజ్ .. ప్లీజ్ అంటూ యుద్ధం చేస్తున్నానని చెబుతున్నారు. పోలవరం నిర్వాసితులకు అదే చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ కు పునరావాసం నిధులు తన వద్ద లేవని.. డబ్బులు ప్రింట్ చేసే అధికారం ఉన్న కేంద్రం ఇవ్వడం లేదని ఆయనంటున్నారు. అదే సమయంలో ఢిల్లీలో వైసీపీ ఎంపీలు కేంద్రం కన్నా ఏపీ బెటరని ప్రకటించుకుంటున్నారు. మోదీని కించ పరుస్తున్నారు.
ఈ క్రమంలో ఏపీలో పోలవరం ప్రాజెక్ట్ కోసం భిన్నమైన డిమాండ్ పెరుగుతోంది. కేంద్రంపై వైసీపీ చేస్తున్న యుద్ధంలో భాగంగా వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేయాలని..అలా అయితేనే కేంద్రం నిధులు ఇస్తుందన్న ఓ వాదన తెరపైకి వచ్చింది. ఈ విషయంలో ప్రతిపక్ష నేతలు కూడా ఇదే డిమాండ్ వినిపిస్తున్నారు. పోలవరం ఏపీ జీవనాడి. ఈ జీవనాడి గత మూడేళ్ల నుంచి మూలన పడింది. కేంద్రం నుంచి నిధులు రావడం లేదు. ప్రాజెక్ట్ ముందుకు సాగడం లేదు. నిర్వాసితులు నష్టపోతున్నారు. కానీ కేంద్రాన్ని ఏపీ సర్కార్ ప్రశ్నించలేకపోతోంది.
చట్టం ప్రకారం పోలవరం జాతీయ ప్రాజెక్ట్. వంద శాతం నిర్మాణ ఖర్చు కేంద్రానిదే. ప్రాజెక్ట్ అంటే డ్యాం మాత్రమే కాదు.. సహాయ, పునరావాసం కూడా. అది పూర్తయితేనే ప్రాజెక్టు పూర్తయినట్లు. లేకపోతే లేదు. కేంద్రం మాత్రం డ్యాం మాత్రమే మా బాధ్యత అంటోంది. ఈ విషయంలో ఏపీ సర్కార్ పోరాడాల్సిన సమయం ఆసన్నమయ్యిందని చర్చ ప్రజల్లో సాగుతోంది. తక్షణం ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందని చెబుతున్నారు. మరి వైసీపీ ఎంపీలు ఏం చేస్తారు ? సీఎం జగన్ చేస్తున్నట్లుగా చెబుతున్న యుద్ధలో పాలు పంచుకుంటారా ? లేదా ?