మోకాలికి బోడిగుండుకి ముడిపెట్టడం రాజకీయాల్లో సహజమే. తనపై వచ్చిన ఆరోపణలు తిప్పికొట్టడానికో… తమ నేతపై వచ్చిన విమర్శలు.. తప్పని చెప్పడానికో.. ఇలాంటి ప్రయత్నాలు చేస్తూంటారు. కానీ .. అలా చెప్పేవి “నిజమే..సుమీ” అని అనిపించకపోతే.. నవ్వుల పాలవుతారు. పవన్‌పై జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించడానికి వైసీపీ నేతలు తమ విధానమేంటో తెలియక కిందామీదా పడతూంటే.. ఎమ్మెల్యే రోజా.. మాత్రం చాలా అసువుగా తనదైన శైలిలో స్పందించారు. బుధవారం విజయవాడలో ఎక్సైజ్ కార్యాలయం ముందు బీరు బాటిళ్లు పగలగొట్టే ప్రోగ్రాం చేసి.. ఓ టీవీచానల్తో మాట్లాడారు.
జగన్మోహన్ రెడ్డి.. పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడంలో తప్పేమీ లేదని… వైసీపీ ఎమ్మెల్యే రోజా తేల్చి చెప్పారు. పవన్ కల్యాణ్ రెచ్చగొట్టడం వల్లే జగన్ అలా అన్నారని ఆమె స్పష్టం చేశారు. పార్లమెంట్, అసెంబ్లీ నుంచి జగన్ పారిపోయారని పవన్ చేసిన విమర్శలతో జగన్‌కు కడపు మండిపోయిందట. అంతే కాదు…. తాను స్వయంగా జగన్‌కు “ధైర్యవంతుడనే” సర్టిఫికెట్ జారీ చేశారు. మూడేళ్లుగా.. చంద్రబాబును నిలదీస్తూ.. ఉక్కిరిబిరి చేస్తున్నారని జగన్‌కు కితాబునిచ్చారు. సోనియాగాంధీనే ఎదిరించిన నేత జగన్ అయితే.. అలాంటి నేతను పారిపోయాడని విమర్శిస్తే… కడపు మండదా అని కవర్ చేసుకున్నారు. తమ అధినేత వ్యాఖ్యల్ని సమర్థించడానికి ఎమ్మెల్యే రోజా… తనపై బోడె ప్రసాద్ చేసిన వ్యాఖ్యల దగ్గర్నుంచి… తమ ఎమ్మెల్యేలు టీడీపీ చేరడం వరకు అన్నింటినీ కారణాలుగా చెప్పుకొచ్చారు. ఈ నాలుగేళ్లలో జరిగిన రాజకీయంతో జగన్ కడుపు మండిపోయి వ్యాఖ్యలు చేస్తే.. దాన్నే బ్రేకింగ్‌లు వేసి మీడియాలో హడావుడి చేస్తున్నారని… విమర్శించారు. అంతే కాదు.. తనపై బోడె ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై ఎవరూ ఎందుకు స్పందించలేదని ఆమె ప్రశ్నించారు.
మొత్తానికి రోజా కవరింగ్… రాజకీయ వర్గాలకు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే.. వైసీపీలో .. అలాంటి “నోటి దురుసు”కు రోజా మొట్టమొదటి బ్రాండ్ అంబాసిడర్. ఆమె స్థాయి బేధం లేకుండా… అందర్నీ ఇష్టం వచ్చినట్లు విమర్శించేస్తూంటారు. తన మాటలతో పోలిస్తే.. జగన్ అన్న మాటలు చిన్నవిగా ఆమెకు అనిపించి ఉండవచ్చు. రోజా తరహాలో ఇటీవలి కాలంలో విజయసాయిరెడ్డి కూడా… నేరుగా చంద్రబాబునే వ్యక్తిగతంగా దూషించడాన్ని ఓ ప్యాషన్‌గా చేసుకున్నారు. ఇక లీడర్లు ఇలా ఉంటే ఇక క్యాడర్ వేరుగా ఎలా ఉంటారు..?. రాజకీయంగా విమర్శిస్తే.. దానికి కౌంటర్ ఇవ్వడానికి.. వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని అసహనం అంటారు తప్ప… తెలివైన రాజకీయం అనిపించుకోదు. ఈ విషయంలో జరిగిన తప్పును ఒప్పుకోవడానికి కూడా వైసీపీ నేతలు సిద్ధంగా లేరని.. రోజా వ్యాఖ్యలతో తేలిపోయింది.