రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన శాసనమండలి సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేశారు. కానీ మంత్రి పదవులకు మాత్రం ఇంకా రాజీనామా చేయలేదు. వారు తమ ఎమ్మెల్సీ రాజీనామాలు ఆమోదం పొందిన తర్వాత ఆరు నెలల వరకు మంత్రులుగా ఉండటానికి అవకాశం ఉంది. రాజ్యసభ సభ్యులు అయినప్పటికీ… వారికి ఈ ప్రివిలేజ్ ఉంటుంది. నైతికంగా కరెక్టా కాదా.. అన్న విషయం పక్కన పెడితే… వారికి ఆ హక్కు ఉంది. అందుకే.. ఇప్పుడు వారు మంత్రులుగా కొనసాగుతారా.. అన్న చర్చ నడుస్తోంది.
పిల్లి, మోపిదేవి ఇద్దరూ మంత్రులుగా రాజీనామాలు చేస్తే.. వారి స్థానాలను సీఎం జగన్ భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇద్దరూ కీలక శాఖలను నిర్వహిస్తున్నారు. రాజీనామా చేసిన తర్వాత పదవుల కోసం.. హైకమాండ్‌పై ఒత్తిడి ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. తమకు చాన్సివ్వాలంటూ.. ఒకరిని మించి ఒకరు ప్రతిభా ప్రదర్శన చేస్తారు నేతలు. రాజకీయ నేతల విన్యాసాలను అంచనా వేయడం కష్టం.. ఒక్కొక్కరు.. ఒక్కోరకంగా ప్రదర్శిస్తూంటారు. కొంత మంది వీర విధేయతను ప్రదర్శించడం ద్వారా.. మరికొంత మంది రెబలిజం ద్వారా.. తమ కోరికను వెల్లడిస్తారు. ఇప్పటికే రఘురామకృష్ణంరాజు వ్యవహారంతో విసిగి వేసారిపోతున్న వైసీపీ హైకమాండ్‌కి.. కొత్తగా.. రెండు మంత్రి పదవుల విషయంలో అలాంటి వాతావరణం ఏర్పడటం ఇష్టం లేదు. లేనిపోని రచ్చ ఎందుకన్న చర్చ ఆ పార్టీలో నడుస్తోంది.
వైసీపీలో మంత్రి పదవుల కోసం చాలా మంది సీనియర్లు వెయిటింగ్లో ఉన్నారు. కృష్ణా జిల్లా బీసీ నేత పార్థసారధి దగ్గర నుంచి చిత్తూరు జిల్లా రెడ్డి నేత రోజా వరకూ.. కనీసం ఇరవై మంది సీనియర్లు రేసులో ఉన్నారు. ఏడాది వేచి చూస్తానని ఆనం లాంటి వారి పరోక్ష హెచ్చరికలు ఉండనే ఉన్నాయి. అందుకే… ప్రస్తుతానికి వారిని మంత్రులుగా కొనసాగించి… పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత రాజీనామా చేయించి.. పదవులు భర్తీ చేయడం మంచిదని అంచనా వేస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే.. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి బెదిరింపులకు లొంగే వ్యక్తి కాదని.. తాను అనుకుంటే.. వారిద్దరితో ఈ రోజే రాజీనామా చేయించి.. తాను అనుకున్న ఇద్దరితో ప్రమాణస్వీకారం చేయించేస్తారని ఆ పార్టీలోని కొంత మంది నేతలు అంటున్నారు.