ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణకు.., ఇప్పుడు ఓ ధర్మ సందేహం వచ్చింది. ఎన్నికలకు ముందు… వైసీపీ మౌత్‌పీస్ అని.. టీడీపీ స్టాంప్ వేసే ప్రయత్నం చేసింది. ఇప్పుడు.. టీడీపీ మౌత్‌పీస్ అని వైసీపీ స్టాంప్ వేసే ప్రయత్నం చేస్తోంది. ఈ విషయాన్ని కన్నా లక్ష్మినారాయణ మీడియా సమావేశంలో ప్రత్యేకంగా గుర్తు చేసి.. తాను ఎవరి మౌత్పీస్నో చెప్పాలని డిమాండ్ చేశారు. కన్నా లక్ష్మినారాయణ.. వైఎస్‌కు విశ్వాసపాత్రుడు. ఆయన హయాంలో చాలా కాలం మంత్రిగా చేశారు. అయితే.. వైఎస్ మరణం తర్వాత.. ఆయన జగన్ వెంట నడవలేదు. కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కారణం ఏదైనప్పటికీ.. బీజేపీలో చేరారు. ఆ పార్టీ తరపున ఏపీలో పోటీ చేయడం.. గెలవడం అన్నది అంత సాధ్యమయ్యే పని కాదు కాబట్టి.. ఎన్నికలకు ముందు వైసీపీలో చేరాలనుకున్నారు. కానీ.. అమిత్ షా.. అడ్డం పడి.. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వడంతో.. ఆగిపోయారు. కేంద్రంలో ఉన్న అధికార పార్టీకి ఏపీ అధ్యక్షుడిగా ఇప్పుడు.. పరపతి ఉంది కానీ.. వ్యక్తిగతంగా ఎలాంటి పదవులు పొందలేకపోయారు.
అయితే.. కొద్ది రోజులుగా… ఏపీ అధికార పార్టీపై చాలా దూకుడుగా వెళ్తున్నారు. తాను చేరాలనుకున్న పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ.. ఆయన సాఫ్ట్ కార్నర్ చూపించడం లేదు. అన్ని విషయాల్లోనూ తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. సాధారణంగా.. తెలుగుదేశం పార్టీ నేతలు అలాంటి విమర్శలు చేస్తూంటారు. అయితే.. ఇతర బీజేపీ నేతలు.. వైసీపీపై కాస్త సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నా… కన్నా మాత్రం .. అసలు తగ్గడం లేదు. మత మార్పిళ్ల దగ్గర్నుంచి ఉద్యోగ నియామకాల వరకూ ప్రతీ అంశంలోనూ విమర్శలు చేస్తున్నారు. దాంతో.. వైసీపీ నేతలు.. కన్నాకు.. టీడీపీకి లింక్ పెట్టడం ప్రారంభించారు. టీడీపీ అధినేత స్క్రిప్ట్ చదవుతున్నారని.. ఆరోపణలు ప్రారంభించారు. దీనిపైనే కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిజానికి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు.. ఆ పార్టీ మీద కన్నా.. అంత కన్నా తీవ్రంగా విరుచుకుపడ్డారు. అప్పట్లో వైసీపీని పల్లెత్తు మాట అనలేదు. టీడీపీకి వ్యతిరేకంగా.. బీజేపీ క్యాడర్ వైసీపీకి ఓట్లు వేయాలన్నట్లుగా… వారి ప్రచార తీరు సాగింది. అందుకే.. అప్పట్లో.. టీడీపీ అధినేత చంద్రబాబు .. కన్నాను.. వైసీపీ అద్దె మైకుగా ప్రచారం చేసేవారు. ఇప్పుడు వాదనను.. వైసీపీ తీసుకుంది. ఎవరేమన్నా.. కన్నా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. నాలుగో తేదీ నుంచి ఏపీ సర్కార్ పై రణభేరీకి ప్రత్యేకమైన కార్యక్రమాలు రూపొందించుకున్నారు. ఇసుక కొరత సహా.. ప్రతీ అంశంపైనా.. పోరాటం చేస్తానని చెబుతున్నారు.