అసెంబ్లీ సమావేశాల బహిష్కరణపై.. వైసీపీ ఎమ్మెల్యేల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇందులోనూ రెండు వర్గాలున్నాయి. ఒకరు ఇప్పటికీ వైసీపీలోనే ఉన్నవారు కాగా..మరో వర్గం… వైసీపీని వదిలి టీడీపీలో చేరిన వారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేవరకూ.. అసెంబ్లీకి రాబోమని.. గత రెండు సెషన్లను బహిష్కరించిన వైసీపీ.. ఈ సారి కూడా.. అదే నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సారి స్పీకర్ కు కొంత సడలింపుతో ఆఫర్ ఇచ్చారు. మంత్రి పదవులు పొందిన వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే.. అందరి కంటే ముందే అసెంబ్లీకి వస్తామని… శ్రీకాంత్ రెడ్డి ప్రకటించారు. స్పీకర్ స్థానాన్ని కోడెల అవమానపరుస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలపై తమకు సమాచారం లేదని.. కొంద మంది వైసీపీ ఎమ్మెల్యేలు నిన్న ప్రకటన చేశారు. దాంతో స్పీకర్ ఆఫీసు వారికి ప్రత్యేకంగా లేఖ పంపింది. ఈ లేఖపై స్పందనగా .. స్పీకర్ పైఆరోపణలు చేశారు వైసీపీ ఎమ్మెల్యేలు.
వైసీపీ ఎమ్మెల్యే ఆరోపణలపై.. ఆ పార్టీకి చెందిన వలస ఎమ్మెల్యేలు మరింత ఘాటుగా స్పందించారు. ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు కలిసి.. జగన్ కు బహిరంగ లేఖ రాశారు. ప్రతిపక్ష నేతగా జగన్ వ్యవహారశైలి … ప్రజాప్రయోజనాలకు పూర్తి భిన్నంగా ఉండటం వల్లే.. వైసీపీని వదిలిపెట్టామని లేఖలో గుర్తు చేశారు. వ్యక్తిగతంగా ఎదుటి మనిషిని గౌరవించే వ్యక్తిత్వం జగన్ కు లేదని .. ఎమ్మెల్యేలు మండి పడ్డారు. జగన్ పై అసంతృప్తితో రాజీనామా చేశామన్నారు. అసెంబ్లీ వ్యవహారాలపై ఎప్పుడూ… అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు విమర్శలు చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఏపీలో మాత్రం.. వైసీపీ, ఎక్స్ వైసీపీ ఎమ్మెల్యేలు ఆ పని చేస్తున్నారు.
అందకు ముందు టీడీపీ నేతలతో .. చంద్రబాబు జరిపిన సమావేశంలోనూ… వైసీపీ ఎమ్మెల్యేల గైర్హాజరు అంశం చర్చకు వచ్చింది. ఉపాధి హామీ పనుల్లో కాస్త అలస్యంగా వచ్చిన వారికి వేతనం ఇవ్వడం లేదని… అసలు అసెంబ్లీకి రాని వారికి ఎలా ఇస్తున్నారని.. మంత్రి అచ్చెన్నాయుడు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిపై అసెంబ్లీలో చర్చించాలని సైటైటర్ వేశారు. ముఖ్యమంత్రి కూడా …జీతాలు తీసుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసెంబ్లీ అవసరం లేదు కానీ ప్రతి నెలా టీఏ, డీఏ, జీతాలు ఎందుకు తీసుకుంటున్నారని సిఎం ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల బహిష్కరణ అంశం.. వైసీపీ చేతులు కట్టేసినట్లయింది. అటు సమర్థించుకోలేక.. ఇటు అసెంబ్లీకి వెళ్లలేక ఎమ్మెల్యేలు ఇక్కట్లు పడుతున్నారు.