ఒక ఆరు నెలల కిందటి వరకు గేదెల శీను అనే పేరు రాష్ట్రంలో ఎవరికీ పెద్దగా తెలియదు. ఉత్తరాంధ్ర లో జన్మించిన ఈయన, సొంత కంపెనీలను కలిగి ఉన్నారు. ఒమిక్స్ జర్నల్ పబ్లిషింగ్ కంపెనీని ఈయన 2007 లో స్థాపించారు. తితిలి తుఫాను సమయంలో శ్రీకాకుళం జిల్లాలో తమ సొంత ఖర్చులతో ఎంతోమంది మానవతా దృక్పథంతో సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. ఈయన కూడా వారిలాగే తన సొంత ఖర్చులతో సహాయ కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ జనసేన జెండా పట్టుకొని ఆ కార్యక్రమాలు చేయడంతో జనసైనికులు అంతా ఆయన చేస్తున్న సహాయ కార్యక్రమాలను సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేసారు. దీంతో ఆయనకు మంచి పేరు రావడం, అది పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లడం, ఈయనకు జనసేన పార్టీ తరఫున వైజాగ్ ఎంపీ టికెట్ కేటాయించడం జరిగిపోయింది. ఈయన చేసిన సేవా కార్యక్రమాలు, జనసైనికులు కలిసి ఈయన ని గెలిపించడం లాంఛనమే అని అందరూ అనుకుంటున్న సమయంలో జనసేన పార్టీ ని మోసం చేసి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసి, గంటల వ్యవధిలో వైఎస్ఆర్సిపి కండువా కప్పుకున్నారు.
హఠాత్తుగా జనసేనాని ని మోసం చేసి జగన్ చెంతకు చేరడం వెనుక రెండు వెర్షన్లు:
టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా జగన్ వద్దకు వెళ్లి వైఎస్సార్సీపీలో చేరడం వెనుక రెండు వెర్షన్లు వినిపిస్తున్నాయి. మొదటిది, ఈయనకు జనసేన పార్టీ ఎంపీ టికెట్ కేటాయించిన తర్వాత కొంతమంది ఈయన కంపెనీ మీద అమెరికాలో ఉన్న లీగల్ కేసులను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురావడంతో, పవన్ కళ్యాణ్ అప్లికేషన్ పూర్తి చేసేటప్పుడు ఈ వివరాలను ఎందుకు దాచి ఉంచావని గట్టిగా నిలదీయడంతో ఈయన అప్పటికప్పుడు వైఎస్ఆర్సిపి నేతలతో మాట్లాడుకుని ఆ పార్టీలోకి వెళ్లిపోయారు అన్నది ఒక వెర్షన్. అయితే రెండవ వెర్షన్, వైఎస్ఆర్ సీపీ నేతలు ఆయనను సంప్రదించి పార్టీ లోకి రావాల్సిందిగా ప్రలోభ పెట్టారు అన్నది. చాలా కాలంగా తమ పార్టీ కోస్తాంధ్ర తో పాటు రాష్ట్రం అంతా బలంగా ఉందని జగన్ చెప్పుకుంటున్నప్పటికీ , కోస్తాంధ్రలో ఆయనకు నాయకుల కొరత తీవ్రంగా ఉందని, పార్టీలో ఉన్న నేతలు గెలవరని ఆయనకు నివేదికలు వచ్చాయి అని, అందుకే గత రెండు నెలలుగా కోస్తాంధ్ర ప్రాంతంలో ఇతర పార్టీల నాయకులను చేర్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని , అందులో భాగమే ఎపిసోడ్ అన్నది రెండవ వెర్షన్. పైగా తితిలీ తుఫాను సమయంలో జగన్ పక్క జిల్లా లో ఉండి కూడా శ్రీకాకుళంలో పర్యటించక పోవడంతో తన మీద ఉన్న వ్యతిరేకతను కొంచెం తగ్గించుకోవడానికి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న వారిని చేర్చుకుంటున్నాడు అని కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
జగన్ కి మూడు రకాలుగా సెల్ఫ్ గోల్
అయితే జగన్ చేసిన ఈ పని జగన్ కి మూడు రకాలుగా సెల్ఫ్ గోల్ గా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
1. హఠాత్తుగా గేదెల శీను కంపెనీల మీద ఉన్న కేసులు తెరమీదకు రావడంతో ఇప్పుడు జగన్ ఆయనకు టికెట్టు కేటాయించినా, ఆయన ఓడిపోవడం ఖాయమని, ఒకవేళ టికెట్ కేటాయించకపోతే అవతల పార్టీలో టిక్కెట్టు వచ్చిన నాయకుని ప్రలోభ పెట్టి , పార్టీలో చేర్చుకుని టికెట్ ఇవ్వలేదనే అపప్రధ మూట కట్టుకోవలసి వస్తుంది.
2. గత రెండు మూడేళ్లుగా తమ పార్టీ ఎమ్మెల్యేలను చంద్రబాబు లాక్కున్నాడని ప్రచారం చేస్తూ సింపతి పొందుతున్న జగన్ ఇప్పుడు తను కూడా అదే తానులో ముక్క అని నిరూపించుకుని, ఫిరాయింపు ఎమ్మెల్యేల కారణంగా రావాల్సిన సానుభూతిని కోల్పోయారు. పైగా ఆయన అధికారంలోకి వచ్చిన ఫిరాయింపులను విస్తృతంగా ప్రోత్సహిస్తాడు ఏమో అన్న అనుమానాలు కలిగించాడు అని ఇంకొందరు విశ్లేషకులు అంటున్నారు.
3. అయితే ఈ రెండింటికీ మించి వినిపిస్తున్న మరొక విశ్లేషణ ఏమిటంటే, జగన్ చేసిన ఈ పని తోనే “జెడి ” లక్ష్మీనారాయణ జనసేన లో చేరే కార్యక్రమం వేగవంతమైంది అని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. లక్ష్మీనారాయణ జనసేన లో చేరాలి అనుకున్నప్పటికీ , వారి చర్చల్లో ఏర్పడిన ప్రతిష్టంభన కారణంగా ప్రక్రియ ఆలస్యం అయింది. ఇంతలో లక్ష్మీనారాయణ ఈ ఎన్నికల్లో తాను ఏ పార్టీలో చేరడం లేదని , పోటీ చేయడం లేదని కూడా ప్రకటించేశారు. అయితే జగన్ గేదెల శీను నీ లాక్కున్న తర్వాత జనసేన పార్టీ , జగన్ ని ఇరిటేట్ చేయడానికే లక్ష్మీనారాయణ ని రాత్రికి రాత్రి పార్టీలో చేర్పించుకున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పుడు లక్ష్మీనారాయణ పార్టీ లో చేరాక జగన్ గురించి ఏం మాట్లాడతారు అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
మొత్తానికి జగన్ వేసుకుంటున్న సెల్ఫ్ గోల్ పరంపర కొనసాగుతూ ఉన్నట్లు అర్థమవుతోంది.