వైసీపీ సీనియర్ నేతలు కుల నాయకులుగా మిగిలిపోతున్నారు. ఘన చరిత్ర ఉండి..ఉమ్మడి రాష్ట్రంలోనే సీఎం పదవికి పోటీ పడినట్లుగా చెప్పుకునే బొత్స సత్యనారాయణ సహా అనేక మంది వైసీపీ సీనియర్ నేతలు తాము కాపు కులానికి మాత్రమే ప్రతినిధులన్నట్లుగా మారిపోతున్నారు. పవన్ కల్యాణ్ కు కౌంటర్ ఇచ్చేందుకు వైసీపీ కాపు నేతలందర్నీ రాజమండ్రిలో సమావేశం కావాలని హైకమాండ్ ఆదేశించింది. దీంతో బొత్స సహా కాపు మంత్రులు.. ఎమ్మెల్యేలు పలువురు హాజరయ్యారు.
రాజకీయాల్లో కులాల అనేది వైసీపీ ప్రభుత్వం నేరుగా తెరపైకి తెచ్చింది. గతంలో ఏ రాజకీయ నాయకుడు కూడా తమపై కుల ముద్ర పడేందుకు సిద్ధంగా ఉండేవారు కాదు. ఎందుకంటే.. ఒక్క కులం ఓటేయడం ద్వారా ఎవరూ విజయం సాధించరు. అందరి మద్దతూ లభించాలి. కానీ వైసీపీ తమ లీడర్లను కుల నాయకులుగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది. దీన్ని కాదనలేని పరిస్థితికి ఆ పార్టీ నేతలు వచ్చేశారు. వారిపై వ్యూహాత్మకంగానే కుల ముద్ర వేస్తున్నారన్న వాదన కూడా వైసీపీలో ఉంది.
నిజానికి వైసీపీలోని కాపు నేతలు.. పవన్ కల్యాణ్‌ను అసభ్యంగా దూషించడం ద్వారా ఇప్పటికే సొంత కులంలో వ్యతిరేకత పెంచుకున్నారన్న వాదన వినిపిస్తోంది. ఇప్పుడు ఇలాంటి కుల మీటింగ్‌ల ద్వారా అుట సొంత కులానికి.. ఇటు ఇతర కులాలకు కాకుండా చేస్తున్నారన్న ఆవేదన ఆ పార్టీ నేతల్లో ఉంది. కానీ ఏదో పదవి ఉంది కాబట్టి ఇప్పుడు నోరు తెరిస్తే వాటినీ పోగొట్టుకోవడం ఎందుకని హైకమాండ్ చెప్పినట్లుగా చేస్తున్నారు.