వైసీపీలో ముసలం స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లా అధ్యక్ష పదవులు వద్దంటూ చాలా మంది రాజీనామా ప్రకటిస్తున్నారు. నిజానికి ఇలాంటి పార్టీ వ్యవహారాలు ఎవరూ బయటకు చెప్పవద్దని.. తామే సర్దుబాటు చేస్తామని వైసీపీ హైకమాండ్ నేతలకు సూచిస్తూ ఉంటుంది. ఇతరుల్ని సైలెంట్‌గా నియమించే వరకూ ఏమీ చేయకపోయినా పదవిలో ఉండాలని చెబుతుంది. కానీ అలా కూడా ఉండటానికి చాలా మంది సిద్ధంగా లేరు. పార్టీ పెద్దలకు ఝులక్ ఇవ్వాలనో.. తమ అసంతృప్తిని బయటకు చెప్పాలనో.. కానీ రాజీనామాలు ప్రకటించేస్తున్నారు.
గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి కాపు సుచరిత.. తాజాగా అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి కాపు రామచంద్రారెడ్డి రాజీనామా చేశారు. మెజార్టీ జిల్లా అధ్యక్షులు తమకు ఆ బాధ్యతలు వద్దంటున్నారు. వీరిని బుజ్జగించడమో.. లేకపోతే వేరే వారిని నియమించడమో చేయకపోతే వారు కూడా అదే ప్రకటనలు చేసే అవకాశం ఉందని ఆ పార్టీలో చర్చ జరగుతోంది. జిల్లా అధ్యక్ష పదవుల్ని వారికి ఇవ్వడానికి కారణం.. మంత్రి వర్గం నుంచి వారిని తొలగించడమో లేదా.. మంత్రి పదవుల్ని ఆశించి అసంతృప్తికి గురి కావడమో. మంత్రి స్థాయిలో ఊహించుకున్న వారికి జిల్లా అధ్యక్ష పదవులు ఇచ్చి గెలిపించుకు వస్తే మంత్రి పదవి మీదే అని జగన్ ఆఫర్ ఇచ్చారు. కానీ అక్కడ ఆ పదవి పేరుతో రాజకీయంగా గ్రహణం పట్టిస్తున్నారని వారికి తెలిసి వచ్చింది.
తమ రాజకీయ భవిష్యత్‌పై కుట్ర జరుగుతోందని వారు అనుమానంతో ఉన్నారు. కనీసం తమ నియోజకవర్గాల్లోనూ పని చేసుకోకుండా.. బలమైన ఇతర నేతలకు ప్రాధాన్యం ఇస్తున్నారన్న అనుమానంలో ఉన్నారు. అందుకే.. రాజకీయ భవిష్యత్‌ను కాపాడుకోవడానికైనా.. జిల్లా అధ్యక్ష పదవుల నుంచి వైదొలగాలని భావిస్తున్నారు. ఆ మేరకు బయటపడతున్నారు. వైసీపీ నేతల్లో అంతర్గత రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి. పార్టీ హైకమాండ్ ముఖ్యంగా సజ్జల దగ్గర పలకుబడి ఉన్న వారికే ప్రాదాన్యత లభిస్తోంది. ఇతరుల మాటలను కూడా ఆలకించేవారు లేకపోవడంతో పరిస్థితి తారుమారవుతోంది.