జూన్లో తల్లికి వందనం ఇస్తామని.. రైతులకు కేంద్రం ఇచ్చే పది వేలతో పాటు మరో పది వేలు కలిపి ఇస్తామని కేబినెట్ లో ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పథకాల పేరు వినగానే వైసీపీకి పోయిన ప్రాణం లేచి వస్తుంది. వెంటనే జగన్ రెడ్డి ట్వీట్ చేశారు. తర్వాత శ్యామలను పిలిపించి ప్రెస్మీట్ పెట్టించి కథలు చెప్పించారు. జగన్ రెడ్డి పాలన దెబ్బ అప్పట్లో ప్రజలపై పడితే ఇప్పుడు వైసీపీ నేతలపై పడింది. మాట్లాడేందుకు ఒక్క సీనియర్ నేత కూడా లేకపోవడం… చివరికి సజ్జల కూడా మాట్లాడేందుకు ఆసక్తి చూపించకుండా యాంకర్ శ్యామలను పిలిపించి యాంకరింగ్ చేపిస్తున్నాయి.
ఆమె తానేదో పెద్ద రాజకీయ నాయకురాలినన్నట్లుగా చేస్తున్న యాక్టింగ్ చూసి ఆ ప్రెస్ మీట్ అంతా కామెడీ అనుకున్నారు కానీ ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. ఎలాంటి టాపిక్ ను ఎవరితో ప్రెస్ మీట్ పెట్టించాలో సజ్జలకు బాగా తెలుసు. కానీ ఆయనే అసలు పార్టీని కామెడీ చేసేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. తామేదో మొత్తం అమలు చేశామని ఇప్పుడూ చెప్పుకుంటారు. అమలు చేస్తే ఈ బాధలెందుకు పడుతున్నారో వారు అర్థం చేసుకోవాల్సిఉన్నా.. ఆ పని చేయడం లేదు. తాము ఉన్న బావి నుంచి బయటకు రావడంలేదు. జగన్ రెడ్డి తన చివరి ఏడాదిలో అసలు పథకాలకు డబ్బులు ఇవ్వకపోవడం వల్లనే ఇప్పుడు ప్రజలు బాధలు పడుతున్నారు.అవే ఇచ్చి ఉంటే ఆయనకు కనీసం ప్రతిపక్ష హోదా వచ్చేది.
ఏపీ ప్రజలు ప్రభుత్వం ఇచ్చే ఐదు, పది వేలకు ఆశపడటం లేదు. ఆ పేరుతో తమను దోపిడీ చేయవద్దని కోరుకుంటున్నారు. ఇచ్చేది పది మందికి .. దోపిడీ చేసి వంద మందిదగ్గర అన్నట్లుగా వైసీపీ పాలన ఉంది. మద్యం సంస్కరణలు చేపట్టడం వల్ల గతంలో సంపాదనను మొత్తం.. మద్యం దుకాణాల్లోనే ఇచ్చే వారు.. ఇప్పుడు అత్యధిక శాతం ఇంటికి తీసుకెళ్తున్నారు. రూ. 99 మద్యం కారణంగా వారి ఆదాయం మిగులుతోంది. ఇది ఎన్నో కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతోంది. ఆర్థికంగా బలపరుస్తోంది. వాళ్ల రక్తాన్ని పీల్చి ఇచ్చే పథకాల గురించి వారికి అవగాహన ఉండదా?.
పథకాల కిరీటాన్ని పెట్టుకుని ఊరేగితే ప్రజలు నమ్మేస్తారని జగన్ రెడ్డి అండ్ కో అనుకుంటే అమాయకత్వమే. శ్యామల లాంటి వారితో యాంకరింగ్ చేయించి.. కాపీ కథలు చెప్పిస్తే కామెడీగా ఉంటుంది కానీ.., పోయిన పరువు తిరిగి రాదు. వైసీపీ తన విధాలను పూర్తిగా మార్చుకుని అసలు తప్పు ఎక్కడ జరిగిందో తేల్చుకునే వరకూ వారి స్థితిలో మార్పు రావడం కష్టమే.