జగన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం నిన్నటి వరకూ గాసిప్ గానే ఉండేది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేరుగానే విషయం చెప్పి.. తాను గల్లీ గల్లీలో ప్రచారం చేస్తానని ప్రకటించడంతో విషయం అధికారికమయింది. కానీ వైసీపీ మాత్రం స్పందించడం లేదు. జగన్ కు అలాంటి ఆలోచన లేకపోతే ఖచ్చితంగా తప్పుడు ప్రచారం అని ఖండించి ఉండేవారు. కానీ మాట కూడా బయటకు రానీయడం లేదు. అంటే.. అంటే వైసీపీ అదే ప్లాన్ లో ఉందని రాజకీయవర్గాలు ఓ అంచనాకు వస్తున్నాయి.
జగన్ ఉపఎన్నికలు వస్తే దేశంలో రికార్డు స్థాయి మెజార్టీలు సాధిస్తామని అనుకోవచ్చు. ఎందుకంటే 2011 లో పులివెందుల అసెంబ్లీకి, కడప పార్లమెంట్‌కు ఉపఎన్నికలకు వెళ్లి భారీ మెజారిటీలు తెచ్చుకున్నారు. వైఎస్ విజయమ్మ, జగన్మోహన్ రెడ్డి చట్టసభళకు వెళ్లారు. ఇప్పుడు కూడా అలాంటి సెంటిమెంట్ పరిస్థితుల్ని రెండు, మూడు నెలల్లో కల్పించుకుని ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నలభై శాతం ఓట్లొచ్చినా తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదని అవమానిస్తున్నారని చెప్పి ఉపఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు.
పులివెందుల, కడప కంచుకోటలే అయినా ప్రజాస్వామ్యంలో ఎప్పుడేం జరుగుతుందో చెప్పడం కష్టం. గతంలో నంద్యాల ఉపఎన్నికల్లో జగన్ గెలిచి తీరుతామని పట్టుదలగా ప్రచారం చేశారు. కానీ పాతిక వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అధికారంలో ఉన్న పార్టీకి ఎన్నికల్లో ఎలా గెలవాలో బాగా తెలుసు. అన్ని వనరులు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు ఉపఎన్నికలకు వెళ్లడం రిస్క్ తో కూడుకున్న వ్యవహారమే. కుటుబంంలో చీలిక వచ్చింది. సోదరి షర్మిల ఏపీ పీసీసీ చీఫ్ అయ్యారు. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ను వెనక్కి తెచ్చుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ముస్లిం, దళిత ఓట్లు కడపలో ఎక్కువగా కాంగ్రెస్ కు పడ్డాయి. అలాంటి సమయంలో రిస్క్ చేసి వారికి అవకాశం ఇస్తే.. రాజకీయ జీవితాన్ని రిస్క్ లో పెట్టుకున్నట్లేనన్న అభిప్రాయం విస్తృతంగా వ్యక్తమవుతోంది. జగన్ నిర్ణయంపై ఉత్కంఠ ప్రారంభమయింది.