వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. తెలుగుదేశం పార్టీ నేతలు వరుసగా ప్రెస్మీట్లు పెట్టి ఇప్పుడేం మాట్లాడతారని వైసీపీ నేతలను ప్రశ్నిస్తున్నారు. హత్య ఘటన మొత్తం జగన్మోహన్ రెడ్డికి తెలుసని అందుకే గుండెపోటుగా నమ్మించే ప్రయత్నం చేశారని అంటున్నారు. అసలు సూత్రధారుల్ని.. గుండెపోటుగా నమ్మించే ప్రయత్నం చేసిన వారిని విచారిస్తే మొత్తం బయట పడుతుందని అంటున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఈ కన్ఫెషన్పై మాట్లాడేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కానీ టీడీపీ నేతలు మాత్రం విరుచుకుపడుతున్నారు. దీనికి కారణం ఉంది.
వివేకా హత్య జరిగినప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అయితే సీఎంగా చంద్రబాబే ఉన్నారు. అయినప్పటికీ దర్యాప్తు జరగకుండా అధికారులను బదిలీచేయడంలో.. మీడియాలో ప్రచారం జరగకుండా హైకోర్టు నుంచి గ్యాగ్ ఆర్డర్స్ తెచ్చుకోవడంలో వైసీపీ సక్సెస్ అయింది. అదే సమయంలో చంద్రబాబే.. టీడీపీ నేతలతో కలిసి హత్యలు చేయించారన్న ప్రచారాన్ని మాత్రం ఉద్ధృతంగా చేశారు. నారాసుర రక్త చరిత్ర అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. వైఎస్ వివేకాను సొంత కుటుంబసభ్యులే చంపినప్పటికీ సానుభూతి కోసం .. చంద్రబాబుపై బురద చల్లారని ఇప్పుడు నిజాలు బయటకు వచ్చాయని..అందుకే వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
వైఎస్ వివేకా హత్యకేసు అంశంలో ప్రస్తుతానికి దస్తగిరి కన్ఫెషన్ మాత్రమే బయటకు వచ్చింది. ఇంకా బయటకురావాల్సినవి చాలా ఉన్నాయంటున్నారు. సాక్ష్యాలు తుడిచేసిన వారిని.. మర్డర్ కేసును గుండెపోటుగా నమ్మించే ప్రయత్నం చేసిన వారిని సీబీఐ ప్రశ్నిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయంటున్నారు. ఆ రోజున గుండెపోటు అని .. వైఎస్ వివేకా మరణవార్తను అధికారికంగా మీడియాకు చెప్పింది విజయసాయిరెడ్డినే. అందుకే సీబీఐ సీరియస్గా విచారణ జరిపితే సంచలనాలు బయటకు వస్తాయని అంచనా వేస్తున్నారు.