వైసీపీలో ముసలం ప్రారంభమయింది. పది అసెంబ్లీ స్థానాలుంటే పదింటిలోనూ గెలిచిన నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వంపై నేరుగా వార్ కు దిగారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా లైన్ లోకి వచ్చారు. మరో ఎమ్మెల్యే అంతర్గతంగా ఫుల్ ఫైర్లో ఉన్నారని బయటకు వస్తారని అంటున్నారు. ఈ పరిస్థితి చూస్తే నెల్లూరు జిల్లాలో వైసీపీ సీన్ కుక్కలు చింపిన విస్తరిలా మారింది . అయితే ఈ ఒక్క జిల్లాలో సరే.. మిగతా జిల్లాల్లో అంతా బాగుందా అంటే…. అదేమీ లేదు.. ఇతర జిల్లాలకూ ఈ ముసలం అంటుకుంటుందన్న వాదన వినిపిస్తోంది.
ఈ వివాదం నడుస్తూండగానే .. కృష్ణా జిల్లా గన్నవరంలో గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు.. అంతకు ముందు ఎన్నికల్లో పోటీ చేసిన దుట్టా రామచంద్రారవు జగన్ సైకో.. సినిమాల్లో విలన్ లా ఉన్నారని తిడుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది. దీంతో పార్టీ నేతల్లో జగన్ పై ఉన్న అభిప్రాయమేమిటో స్పష్టమవుతోంది. జగన్ విషయంలో నాలుగేళ్ల పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు ఎదురు చూశారని ఇక ఏ మాత్రం ప్రయోజనం ఉండదని తేల్చుకుని ముందు ముందు నోరు విప్పేందుకు సిద్ధమవుతున్నట్లుగా ఈ పరిణామాలతో అర్థం చేసుకోవచ్చు.
కడప జిల్లాలో కూడా నేతలు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరు విప్పు విప్పుతున్నారు. కానీ ఇంకా ఎమ్మెల్యేలు బయటపడలేదు. దాదాపుగా ప్రతీ జిల్లాలో ఇద్దరు , ముగ్గురు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు వారు కూడా బయటకు వస్తారని.. ముందు ముందు వైసీపీలో అల్లకల్లోలం అంటే ఎలా ఉంటుందో కనిపిస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ నాలుగేళ్లకాలం జగన్ ను ముఖాముఖి కలుసుకోలేని ఎమ్మెల్యేలు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారు .. తాము ఎమ్మెల్యే అయి ప్రయోజనం ఏమిటని ఫైర్ అవుతున్నారు.
ఎలా చూసినా నెల్లూరు ముసలం.. ఇతర జిల్లాలకు ఆపకుండా వైసీపీ పెద్దలు ఆపడం కష్టమే.