వైసీపీ సోషల్ మీడియాలో సజ్జల భార్గవ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. ఇప్పటి వరకూ పార్టీని అంటి పెట్టుకుని ఉన్న వారిని కాదని సజ్జల భార్గవకు చాన్సివ్వడంతో ఆయన తన తండ్రి రామకృష్ణారెడ్డి ఎలా అయితే వైసీపీలో జగన్ చుట్టూ ఉన్న వారందర్నీ దూరం చేసి.. తాను మాత్రమే కనిపించేలా చేసుకున్నారో.. అలాగే… భార్గవ కూడా సోషల్ మీడియా అంటే తాను.. తన మనుషులే అన్నట్లుగా ఉండాలని స్కెచ్ వేసి అమలు చేసుకుంటున్నారు. బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి సోషల్ మీడియా మొత్తాన్ని తన సన్నిహితులతో నింపేశారు. ఎక్కువగా వారితో కలిసే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు.
సజ్జల భార్గవ్‌కు ఆయన తండ్రి కొంత మంది ఇంటలిజెన్స్ పోలీసుల్ని అప్పగించినట్లుగా తెలుస్తోంది. ఓ డీఐజీ పూర్తిగా సజ్జల భార్గవ్ కనుసన్నల్లో పని చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆ డీఐజీ సహకారంతో సోషల్ మీడియా స్ట్రాటజీల్ని అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ పార్టీ కోసం తెగ తాపత్రయపడిన వారికి కనీస గుర్తింపు లేదు. ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్ గాఉండేవారితో సజ్జల భార్గవ్ మాట్లాడుతున్నారు కానీ.. చాలా మందిని పిలవడం లేదు. గతంలో పదవులు ప్రకటించిన వారిని కాకుండా తన పరిచయస్తులు లేదా… కాకా పట్టిన వారికే భార్గవ ప్రాధాన్యం ఇస్తున్నారు.
అంతకు మించి సజ్జల భార్గవకు… రాజకీయ ఆశలు ఉన్నాయి. ఆయన తండ్రి… సలహాదారుగా ఉండవచ్చు కానీ.. తాను మాత్రం రాజకీయ నాయకుడ్ని కావాలని అనుకుంటున్నారు. ఆయన తండ్రి ఆలోచన కూడా అదే. అందుకే ఇప్పటి నుంచే సజ్జల భార్గవ ఇమేజ్ బిల్డింగ్ మీద దృష్టి పెట్టుకుంటున్నారు. రకరకాల ఫోటోలు తీసి లీక్ చేసుకుంటున్నారు. తన గురించి ప్రచారం జరిగేలా చేసుకుంటున్నారు. ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందోనని.. వైసీపీలోనే చర్చ ప్రారంభమయింది. విజయసాయిరెడ్డి సోషల్ మీడియాను డీల్ చేసినప్పుడు .. ఫేక్ అయినా బాగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారని.. ఇప్పుడు ఇంటలిజెన్స్ ను అడ్డం పెట్టుకుని లోకేష్ పాదయాత్ర విషయంలో చేస్తున్న ప్రచారం అడ్డం తిరగడం….భార్గవకు మైనస్ అవుతోంది. దీనికి కారణం.. సోషల్ మీడియా టీంలో ఏర్పడిన చిచ్చేనని చెబుతున్నారు