వచ్చే ఎన్నికల్లో ఎవ్వరితోనూ పొత్తులు ఉండవ్ అంటూ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు! అదే విషయాన్ని సాక్షి కూడా రాసింది. జగన్ కు పవన్ కల్యాణ్ మద్దతు ఇస్తారన్న ప్రతిపాదన ప్రచారం మాత్రమేననీ, తన వరకూ అలాంటిది రాలేదనీ, ఎవ్వరి మద్దతూ లేకుండా పోటీ చేసే సత్తా వైకాపాకి ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్ అభిమానులు టీడీపీ ఓట్లను మాత్రమే చీల్చుతారని జగన్ చెప్పారు. ఈ దశలో ఒకరి మద్దతు కోసం, లేదా ఒక పార్టీ పొత్తు కోసం ఆలోచించే అవసరం తమకు లేదని జగన్ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాపై మొదట్నుంచీ పోరాటం చేస్తున్నామనీ… లిఖితపూర్వకంగా దీనిపై స్పష్టత ఇచ్చే పార్టీలకు మాత్రమే కేంద్రంలో మద్దతు ఇస్తామన్నారు. జాతీయ రాజకీయాలు, ఫ్రెంట్ లలో చేరిక వంటి అంశాలపై తనకు ఆసక్తి లేదని చెప్పారు.
‘పొత్తు ఉండవ్’ అని జగన్ ప్రత్యేకంగా ప్రకటించాల్సిన పనిలేదు. ఎందుకంటే, వైకాపాతో పొత్తు పెట్టుకునేందుకు ఏ పార్టీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో సిద్ధంగా లేదన్నది వాస్తవం! ఆంధ్రాని నిలువునా మోసం చేసిన భాజపాతో వైకాపా నేతలు ఎంత సఖ్యంగా ఉంటున్నారో గత పార్లమెంటు సమావేశాలే సాక్ష్యం. రాష్ట్రంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై పోరాటం జరుగుతున్నా, దానిపై జగన్ మాట్లాడలేకపోతున్న పరిస్థితే అందుకు మరో నిదర్శనం. అలాగని, భాజపా ఎగిరి గంతేసి వైకాపాతో పొత్తు అని ఎన్నికల ముందు అనలేదు. ఎందుకంటే, దేశంలో అవినీతిని క్లీన్ చేయడమే తన లక్ష్యం అంటూ మోడీ సాబ్ చెబుతున్నారు కదా. అవినీతి కేసుల్లో జగన్ ఇరుక్కుని వారానికోసారి కోర్టు మెట్లెక్కుతున్నారు. కాబట్టి, ఎన్నికల ముందు భాజపా పొత్తు ప్రకటిస్తే.. వారికే నష్టం. సో.. జగన్ తో పొత్తుకు భాజపా ముందుకు రాలేదు.
ఇక, పవన్ కల్యాణ్ విషయానికొస్తే… జగన్ తో కుదిరే ప్రసక్తే లేదు. వామపక్షాలతో ఆయన కలిసి పోటీ అంటున్నారు. టీడీపీకి వ్యతిరేకంగా జనసేన బరిలోకి దిగినా… వైకాపాకి మద్దతు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దానికి కారణమూ జగన్ కేసులే అనడంలో సందేహం లేదు. మిగిలింది కాంగ్రెస్ పార్టీ..! వైయస్సార్ లెగసీని జగన్ సొమ్ము చేసుకుంటున్నారనే గుర్రుతో ఏపీ కాంగ్రెస్ ఉంది. పార్టీ వీడి వెళ్లిన నేతల్ని మళ్లీ వెనక్కి తీసుకొచ్చే కార్యక్రమం ఆ పార్టీ మొదలుపెట్టింది. అలాగని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంటుందన్న నమ్మకం వారికీ లేదు. కానీ, గతం కంటే కొంత మెరుగైనా.. ఆమేరకు చీలిపోయేవి వైకాపా ఓట్లే కదా! ఎందుకంటే, వైకాపాకు సొంత కేడర్ అంటూ ఏమీ లేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పై ప్రజలకు ఉన్న ఆగ్రహమే… వైకాపాకి కొంత ఓటు బ్యాంకుగా మారింది.
సో… పవన్ వల్ల టీడీపీ ఓటు బ్యాంకు చీలుతుందని జగన్ చెబుతున్నారుగానీ, కాంగ్రెస్ వల్ల వైకాపాకి కూడా అదే పరిస్థితి పొంచి ఉందనేది తెలుసుకోవాలి. ఎవ్వరితోనూ పొత్తులుండవ్ అని జగన్ తమ నిర్ణయంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే, ఇతర పార్టీలు వైకాపాతో పొత్తుకు ఇప్పుడు సిద్దంగా లేవు. ఎన్నికల తరువాతే ఎలాగూ ఎవరి పంచకు ఎవరు చేరతారనేది కూడా స్పష్టంగానే ఉంది! ఇంకోటి, ప్రత్యేక హోదాపై లిఖిత పూర్వక హామీ ఇచ్చిన పార్టీకే కేంద్రంలో మద్దతు అనడమూ హాస్యాస్పదమే. లిఖితపూర్వకంగా ఎవరైనా ఇవ్వగలరా..? పాదయాత్రలో చేతికి ఎముక లేకుండా ఉదారంగా జగన్ ఇస్తున్న హామీలను కూడా లిఖితపూర్వకంగా ఇవ్వగలరా..? ఇచ్చినా ఏం ప్రయోజనం..? అలాంటి పత్రాలకు ప్రాధాన్యత ఎలా వస్తుంది..? విభజన చట్టంలో ఉన్న అంశాలనే అమలు చెయ్యని పరిస్థితి ఉందిక్కడ.