చంద్రబాబు ఈవీఎంలపై పోరాటం చేస్తూండటంతో.. అది తమ గెలుపునకు సూచిక అనుకుంటున్న వైసీపీ నేతలు.. ప్రభుత్వ ఉన్నతాధికారులపై.. మైండ్‌గేమ్ ప్రారంభించారు. తమ అనుకూల వెబ్ సైట్లలో.. ఏపీ ఉన్నతాధికారులు… కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు దరఖాస్తులు చేసుకున్నారంటూ పుకార్లు పుట్టిస్తున్నారు. వారికి అనుకూలంగా కొన్ని వెబ్ సైట్లలో .. ఈ తరహా రాతలు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. డీజీపీ ఆర్పీ ఠాకూర్, ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్, సీఎం కార్యాలయంలో కార్యదర్శి గిరిజాశంకర్, కేంద్ర సర్వీసులకు దరఖాస్తు చేసుకున్నట్టు ప్రచారం ప్రారంభించేశారు. అయితే.. తమకు అటువంటి ఉద్దేశమేలేదని, ఎవరూ కూడా కేంద్ర సర్వీసులకు దరఖాస్తు చేసుకోలేదని వారు తేల్చి చెప్పారు. అయినా .. సరే.. గెలుపు మాదే అనే నమ్మకానికి పెంచుకోవడానికి వైసీపీ నేతలు.. ఇలాంటి ప్రచారాలను ఉద్ధృతంగా చేస్తూనే ఉన్నారు.
అయితే.. గత ప్రభుత్వంలో పెద్దగా ప్రాధాన్యం దక్కని కొంత మంది అధికారులు మాత్రం.. ఇప్పటికే వైసీపీ నేతలతో టచ్‌లోకి వెళ్లిపోయినట్లు.. అధికారవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కొంత మంది ఐఏఎస్ అధికారులు కూడా.. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లుగా.. బయటకు లీకులు ఇచ్చుకుంటున్నారు. అది లోటస్‌పాండ్‌కు చేరితే చాలన్నట్లుగా ఉంటున్నారు. ఇప్పటికే ప్రారంభించిన పనులను పక్కన పెట్టడం మాత్రమే కాదు.. మరికొందరు వైసీపీ నేతల స్టైల్లో చంద్రబాబుపై నోరు పారేసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. కొంత మంది అధికారులు మంత్రులు, ఎమ్మెల్యేల ఫోన్లకు అందుబాటులోకి కూడా రావడం లేదు. దీనిపై టీడీపీ నేతలు.. చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు.
గుంటూరు జిల్లాలో ఓ నియోజకవర్గంలో మూడు గ్రామాల్లో రిగ్గింగ్ జరుగుతోందని తాను పదేపదే ఫిర్యాదు చేసినప్పటికీ అక్కడున్న పోలీసులు పట్టించుకోలేదని ఓ ఎమ్మెల్యే చంద్రబాబుకు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో కూడా కొంతమంది అధికారులు వ్యవహారించిన తీరుపై అక్కడున్న ఓ ఎమ్మెల్యే సీఎంకు వివరించారు. మరికొంత మంది డీఎస్పీ స్థాయి పోలీస్ అధికారులు, ఎస్పీ స్థాయి అధికారులు వ్యవహారించిన తీరుపై సీఎంకు ఎమ్మెల్యేలు, మంత్రులు ఫిర్యాదు చేశారు. మొత్తంగా.. ఈసీ వ్యవహారశైలి వారిపై తీవ్ర ప్రభావం చూపిందని టీడీపీ నేతలు అంటున్నారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తే.. ఎలాంటి చర్యలు ఉండవని.. అదే టీడీపీకి అనుకూలంగా ఉంటే.. బదిలీలేనని.. చేతలతో చూపించడం .. అధికారయంత్రాంగంపై చాలా తీవ్రమైన ప్రభావం చూపిందంటున్నారు.