ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న వ్యవహారాలు.. పోలీసుల తీరు ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతూనే ఉన్నాయి. జరుగుతున్న పరిణామాలు చూస్తే అసలు పోలీసు వ్యవస్థ ప్రజల కోసం ఉందా లేకపోతే.. దాడులు, దౌర్జన్యాలు, నేరాలు చేసే నేరగాళ్ల కు కొమ్ము కాసేందుకు ఉందా అన్న అనుమానం సామాన్య ప్రజలకు వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి. దానికి మంగళవారం జరిగిన పరిణామాలే సాక్ష్యంగా కనిపిస్తున్నాయి.
దాడులు చేసిన వారిపై కాకుండా బాధితులపైనే కేసులు
విజయవాడలో దేవినేని అవినాష్ ను ప్రశ్నించిన ఓ ఒంటరి మహిళ ఇంటిపైకి ఇతర ప్రాంతాల వారు వచ్చి దాడి చేశారు. కానీ కేసు పెట్టింది మాత్రం బాధిత మహిళపైనే. అక్కడ చాలా స్పష్టంగా ఇతర ప్రాంతాల మహిళలు ఆ మహిళ ఇంటిపైకి వచ్చారని తెలుస్తోంది. వారెవరో కూడా వీడియోల్లో ఉంది. కానీ దాడి చేసినవారిని వదిలేసి..బాధితులపై పోలీసులు కేసులు పెట్టారు. రోజంతా పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఇది ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. పోలీసుల నీతి, నిజాయితీలపై ప్రజల్లో సందేహాలు పెరిగిపోయేలా చేస్తోంది.
జీవో నెంబర్ వన్‌పై ఏడీజీ ప్రెస్ మీట్ చేసిన వారికి.. పోలీసుల తీరుపైనా సందేహాలు రావడం సహజమే !
ఇక సోమవారమే ప్రతిపక్షాల సభలు, సమావేశాల అణిచివేత కోసం తెచ్చిన జీవో విషయంలో ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్ ప్రెస్‌మీట్ పెట్టారు. ఆయనకు సంబంధం లేకపోయినా జీవోను అడ్డగోలుగా సమర్థించుకున్నారు. కానీ వైసీపీ నేతలు ఆ జీవోను ఉల్లంఘిస్తున్నారనేదానికి ఆయన వద్ద సమాధానం లేదు. అడ్డుకోవడానికి వేల మందిని పెట్టడం కన్నా… భద్రతకు వందల మందిని పెడితే సరిపోతుంది కదా అన్న చిన్న లాజిక్ కూ ఆయన వద్ద సమాధానం లేదు. అసలు ఆ జీవో ఎలా చట్టబద్దత అన్నదికూడా ఆయన చెప్పలేకపోయారు.
పోలీసులు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న దారుణమైన పరిస్థితులు
ఈ రెండు ఘటనలతో అటు కింది స్థాయి పోలీసుల నుంచి పై స్థాయి పోలీసు అధికారుల వరకూ ఎవరూ చట్ట పరిధిలో పని చేయడం లేదని.. కేవలం వైసీపీ కోసం ప్రైవేటు సైన్యంలా.. చట్టాన్ని దుర్వినియోగం చేసి.. ప్రజల్ని హింసిస్తున్నారన్న ఆందోళనలో ప్రజల్లో పెరిగిపోయే ప్రమాదం కనిపిస్తోంది.
పోలీసులే తప్పుడు కేసులు పెట్టే స్థితికి దిగజారిన పోలీసింగ్
కుప్పంలో పోలీసులే తమపై టీడీపీ కార్యకర్తలు హత్యాయత్నాలు చేశారని ఫిర్యాదులు చేసుకుని వారే అరెస్టులు చేస్తున్నారు. కుప్పంలో ఏం జరిగిందో వీడియోల్లో స్పష్టంగా ఉంది. అయినా మహిళా కార్యకర్తల్ని కూడా వదలకుండా పోలీసులు హత్యాయత్నం కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. నిజానికి ఏపీలో ఈ పరిస్థితి మొదటి నుంచి ఉంది. ప్రతిపక్షాలపై దాడులు చేసిన కొన్ని వందల ఘటనల్లో కేసులు నమోదు కాలేదు. డీజీపీ ఆఫీసు పక్కనే ఉన్న టీడీపీ ఆఫీసుపై దాడి చేస్తే కేసులు పెట్టలేదు. మాచర్లలో పట్ట పగలు హత్యాయత్నాలు జరిగితే కేసులు పెట్టలేదు. చాలా చోట్ల పెట్టినా… చిన్న చిన్న సెక్షన్లు వైసీపీ వాళ్లపై పెడతారు. పోలీసింగ్ మొత్తం దారి తప్పిందని ఇప్పుడు ప్రజల్లో ఓ భావన బలపడుతోంది.
పోలీసు వ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోతే అరాచకమే- దానికి చేరువలో ఏపీ పోలీస్ పనితీరు !
ప్రజలపై పోలీసులు నమ్మకం కోల్పోతే అరాచకం ఏర్పడుతుంది. అది అంతర్యుద్ధానికి దారి తీస్తుంది. ఒకప్పుడు సీఎం జగన్ తనకు ఏపీ పోలీసులకు నమ్కం లేదని చెప్పేవారు. ఇప్పుడు అసలు పోలీసులను ప్రజలు నమ్మకుండా చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇదంతా ఓ ప్రణాళిక ప్రకారం జరుగుతోందని… వ్యవస్థపై ఎప్పుడూచూడనంత దాడి జరుగుతోందని.. ఈ విషయాన్ని వ్యవస్థను కాపాడుకోవాల్సిన ఉన్నతాధికారులు గుర్తించినా .. మిన్నకుండి పోతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.