కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్న సమయంలో.. వైసీపీ బీజేపీకి అండగా నిలిచింది. ఎన్డీఏ పక్షంలోని పార్టీలే ఆ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎన్డీఏ నుంచి వైదొలుగుతున్న సమయంలో.. వైసీపీ ఎలాంటి మొహమాటాలు పెట్టుకోలేదు. తాము మద్దతిస్తున్నామని రాజ్యసభలో జరిగిన చర్చలో విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఈ బిల్లుల వల్ల రైతులు ఎదుర్కొంటున్న మద్దతు ధర, గిట్టుబాటు ధర సమస్య పరిష్కారం అవుతుందని విజసాయిరెడ్డి ప్రకటించారు. వైసీపీకి రాజ్యసభలో ఆరుగురు సభ్యులు ఉన్నారు. వారి మద్దతు ప్రస్తుతం బీజేపీకి ఎంతో కీలకం. అకాలీదళ్‌తో పాటు ఇంత కాలం ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో సహకరిస్తున్న టీఆర్ఎస్ లాంటి పార్టీలు వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించుకున్నాయి. దీంతో వైసీపీ మద్దతు బీజేపీకి కీలకంగా మారింది.
రాజ్యసభలో కేంద్రానికి ఎంపీల అవసరం వచ్చినప్పుడు.. రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేకహోదా వంటిఅంశాలపై పట్టుబట్టి సంతకం పెట్టిన తర్వాతనే మద్దతిస్తామని జగన్మోహన్ రెడ్డి అదే పనిగా చెప్పేవారు. ఇప్పుడు ఎలాంటి షరతుల్లేకుండా.. మద్దతిచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే .. రాజధాని భూములు, ఫైబర్ నెట్ వంటి వాటిపై సీబీఐ విచారణ జరిపించాలనే అంశాలపై వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఈ దిశగా రాజకీయంగా ఉపయోగపడే అంశాలపై వారు అంతర్గతంగా మాట్లాడుకుని ఉంటారన్న చర్చ ఢిల్లీలో జరుగుతోంది.
వ్యవసాయ బిల్లులు రైతుల కష్టాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేలా ఉన్నాయన్న విమర్శలు దేశవ్యాప్తంగా వస్తున్నాయి. ఆందోళనలు కూడా పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఇప్పుడిప్పుడే దక్షిణాదికి కూడా.. ఆ ఆందోళనలు విస్తరిస్తున్నాయి. అయినప్పటికీ.. వైసీపీ రైతుల ఆందోళనల్ని ఏ మాత్రం పట్టించుకోకుండా.. కేంద్రానికి మద్దతిచ్చేందుకు సిద్ధమయింది. గతంలో ఎన్నార్సీ బిల్లుకు కూడా అలాగే మద్దతిచ్చింది. రాష్ట్రంలో ఆందోళనలు పెరిగే సరికి.. వ్యతిరేకిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. బిల్లుకు మద్దతుగా ఓటేసిన తర్వాత వ్యతిరేకించడం ఏమిటో.. చాలా మందికి అర్థం కాలేదు. కానీ అదే రాజకీయం. ఇప్పుడు వ్యవసాయబిల్లు విషయంలోనూ రైతుల ఆందోళనలు పెరిగిపోతే.. తర్వాత అదే చెప్పే అవకాశం ఉంది.