151 సీట్లతో.. 50 శాతం ఓట్లతో.. 80 శాతానికిపైగా స్ట్రైక్ రేట్‌తో ప్రజలు గెలిపించారని.. వారు తనను గుండెల్లో పెట్టుకున్నారని జగన్ ఐదేళ్ల పాటు చెప్పారు. మరి పదేళ్ల తర్వాత ఆయనను గుండెల్లోనుంచి తీసి పడేసి పాతాళంలోకి పడేశారు.కనీసం ఆయనకు ప్రతిపక్ష నేత హోదా దక్కలేదు. ఇలాంటి దుస్థితి ఎందుకు వచ్చిందో ఆయన ఎప్పుడైనా ఆలోచించారా?. ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునే ప్రయత్నం చేశారా ?. చేయలేదని.. అనుకోవచ్చు. ఎప్పుడూ ఓటమిపై సమీక్షలు చేయలేదు… సరికదా ఆయనకు ఆయన చంద్రబాబు ఇచ్చిన హామీల వల్లనే .. ప్రజలు పథకాలకు ఆశపడి ఓడించారని ఊహించుకుంటారు. కానీ అసలు ఎందుకు తన ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందో మాత్రం అంచనా వేసుకోలేకపోతున్నారు.
అరాచకపాలనతో ప్రజలను రాచిరంపాన పెట్టిన వైసీపీ నేతలు
జగన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో విరక్తి పెరగడానికి ప్రధాన కారణం అధికార దుర్వినియోగం చేసి ప్రత్యర్థులు, ఇతరులపై రెచ్చిపోయిన నేతలే. వైసీపీ ఓడిపోయిన వెంటనే ఆ పార్టీని ప్రజల్లో పనికిమాలిన పార్టీగా గుర్తింపు తెచ్చిన ఐదారుగురు గురించి ఎక్కువగా చెప్పుకున్నారు. అరాచకత్వం.. అధికారమదంతో వారు చేసిన అతి కారణంగానే వైసీపీ ఓడిపోయింది. అలాంటి వారిలో వల్లభనేని వంశీ ఒకరు. ఇప్పుడు కూడా వారికే మద్దతు ఇస్తున్నట్లుగా రాజకీయం చేస్తున్నారు. ప్రజల నుంచి వారికి కనీస సానుభూతి రావడం లేదని తెలిసి కూడా .. వైసీపీ నేతలు అరాచకానికి మద్దతు పలుకుతున్నారు.
అదే అరాచక ఇమేజ్ కొనసాగిస్తే కష్టమే
ప్రజల్లో ఇమేజ్ పెంచుకోవడం ఇప్పుడు జగన్ కు అత్యవసరం. ఆ పార్టీ అరాచక పార్టీ అన్న ముద్ర ఉంది. దానికి కారణం అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన విధానమే. తాము అలాంటి అరాచకాల్ని సహించబోమని.. రాజ్యాంగాన్ని పాటిస్తామని ప్రజలకు మరోసారి నమ్మకం కలిగిస్తే తప్ప.. వారు వైసీపీని విశ్వసించే అవకాశం ఉండదు. ఎంత ఘోరంగా వైసీపీ పాలన,అరాచకంపై ప్రజలు తిరగబడ్డారో ఫలితాలే నిరూపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో జగన్ తన పార్టీ ఇమేజ్ ను మేకోవర్ చేసుకోవాలి కానీ.. వంశీ లాంటి అరాచకవాదులతో ములాఖత్‌లతో వైసీపీ ఇక మారదన్న సంకేతాలను ప్రజలకు పంపుతున్నట్లవుతుంది.
జగన్ చేయించిందే.. మద్దతివ్వకపోతే మరో కష్టం !
నిజానికి వంశీకి మద్దతివ్వడం జగన్ కూ ఇష్టం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన సామాజికవర్గం అంటే జగన్ కు పడదు. వంశీపై జగన్ కు ఎలాంటి అభిమానం లేదు. కానీ ఆయనను ఇష్టారీతిన ఉపయోగించుకుని..ఆయన జీవితాన్ని రోడ్డున పడేసి ఇప్పుడు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తాయని కంటి తుడుపుగా మద్దతిస్తున్నారు. అది కూడా ఆ పార్టీకి భారమే. వైసీపీ ఇలాగే వ్యవహరిస్తే కూటమికి కావాల్సిందేమీ ఉండదు.