రాజకీయాల్లో కనీస విలువలు పాటిస్తేనే ఎంతో కొంత ప్రజల్లో పలుకుబడి ఉంటుంది. కనీసం పాటిస్తున్నట్లుగా ప్రజల్ని నమ్మించాలి. అంతే కానీ మాకు సిగ్గూ ఎగ్గూ లేదని.. నైతికత అనేదే లేదని ఎప్పటికప్పుడు బట్టలు విప్పేసుకుని రోడ్డు మీద పడిపోతూంటే ప్రజలు అసహ్యంగా చూస్తారు. గత ఐదేళ్లలో అదే చేశారు. ఫలితంగా ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది. అయినా అదే చేస్తున్నారు. ఈ సారి నేరుగా టీడీపీ ఉన్న కూటమికి సపోర్ట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇంత కన్నా నైతిక దివాలా ఉంటుందా ?
ఎన్డీఏకు సపోర్ట్ అంటే టీడీపీకి సపోర్ట్ చేయడమే !
లోక్ సభ స్పీకర్ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి తరపున ఓం బిర్లాను ప్రకటించారు. కూటమిలో బీజేపీ తరపున అతి పెద్ద పార్టీ టీడీపీ. అంటే ఆయన టీడీపీ నిలబెట్టిన అభ్యర్థి కూడా. మరి ఇలాంటి అభ్యర్థికి జగన్ ఎలా మద్దతు ఇస్తారు. ఏపీలో టీడీపీతో పోరాడుతూ… ఢిల్లీలో టీడీపీ కూటమి తరపున నిలబెట్టిన అభ్యర్థికి మద్దతు ఎలా ఇస్తారు. కేంద్ర ప్రభుత్వంలో కూడా టీడీపీ భాగస్వామ్యం ఉంది. ఎ విషయంలో అయినా ఎన్డీఏకి సపోర్టు చేయడం అంటే… టీడీపీకి సపోర్టు చేయడమే.
రాజకీయాల్లో ఇంత అనైతికత జగన్కు మాత్రమే !
జగన్ రెడ్డి కి రాజకీయాల్లో నైతికత అనేదే లేదు. తన తండ్రిని రిలయన్స్ వాళ్లు చంపించారని.. నాడు తన అనుచరులతో ఏపీ మొత్తం దాడులు చేయించారు. తర్వాత రిలయన్స్ నుంచి ప్రముఖులు వస్తే రెడ్ కార్పెట్ వేసి ఇంట్లోకి ఆహ్వానించి విందు ఇచ్చి.. రాజ్యసభ ఇచ్చారు. అప్పుడే ఆయన ఇంత ఘోరమైన వ్యక్తా అని అందరూ ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత లోకేష్ బినామీ అంటూ ప్రచారం చేసిన శేఖర్ రెడ్డికి తాను అధికారంలోకి రాగానే టీటీడీ బోర్డు సభ్యత్వం ఇచ్చారు. ఇలా చెప్పుకుంటే ఓ పెద్ద గ్రంథం.. జగన్ అనైతికతపై తయారవుతుంది.
ప్రజలు అసహ్యించుకున్నా విలువలతో కూడిన రాజకీయాలు చేయలేరా ?
ఏ మాత్రం విలువల్లేవని పాలన చేసి ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వనంత స్థాయికి దిగజారిపోయారు. అయినా ఇప్పటికీ జగన్ రాజకీయ పంథా మార్చుకోలేదు. టీడీపీ ఉన్న కూటమికి మద్దతివ్వడం అంటే.. రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్లే. బీజేపీ ప్రాపకం కోసం ఆయన కిందా మీదా పడవచ్చు కానీ.. ఆయనను జనం మరో రకంగా చూస్తారు. కనీసం ఓటింగ్ కు దూరంగా ఉండేలా నిర్ణయం తీసుకున్నా కొంత పరువు దక్కేది.