వైసీపీ సర్పంచ్లు రోడ్డెక్కుతున్నారు. సొంత ప్రభుత్వంపై ఢిల్లీలో ఫిర్యాదులు చేసేందుకు వెళ్తున్నారు. సొంత ప్రభుత్వంపై ఢిల్లీలో ధర్నాలు చేయాలనుకుంటున్నారు. దీనికి కారణం.. పంచాయతీల ఆదాయం మొత్తం ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకోవడమే కాదు.. ప్రత్యామ్నాయ వ్యవస్థగా గ్రామ సచివాలయాలను పోషిస్తూండటం కూడా. దీనిపై వైసీపీ సర్పంచ్లు విజయవాడలో సమావేశమయ్యారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని పంచాయతీలను నిర్వీర్యం చేయడం ద్వారా జగన్ నాశనం చేస్తున్నారన్న అభిప్రాయానికి వచ్చారు. పోరాటం చేయాలని డిసైడయ్యారు.
ప్రభుత్వం పంచాయతీల డబ్బులను తీసేసుకుంటోంది. అయితే ఇటీవల గ్రామ సచివాలయాలకు మాత్రం రూ. ఇరవై లక్షలు విడుదల చేస్తామని ప్రకటించింది. దీంతో సర్పంచ్లు మరింత రగిలిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిన కేంద్ర నిధులను పంచాయతీలకు తిరిగి జమ చేయాలని ఆందోళనలు ప్రారంభించారు. గ్రామ పంచాయతీలకు నిధులు లేక అభివృద్ధి పనులు చేయలేక ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామని వారు వాపోతున్నారు. కేంద్రప్రభుత్వం 14,15 ఆర్ధిక సంఘం కింద పంచాయతీలకు ఇచ్చిన నిధులను విద్యుత్ బకాయిల పేరుతో నేరుగా విద్యుత్ పంపిణీ సంస్థలకు మళ్లించేందుకు సర్పంచులకు తెలియకుండా, రాజ్యాంగ విరుద్ధంగా నిధులు మళ్లించేందుకు ఆర్ధికశాఖ జీవోలు ఇచ్చింది. అయితే ఇవి రహస్యంగా ఉన్నాయి.
కరెంటు బిల్లు కోసం చెల్లించి ఉంటే పంచాయతీలకు రశీదులు ఎందుకు ఇవ్వలేదని వైవీబీ ప్రశ్నించారు. విద్యుత్ బిల్లుల బకాయిల రికవరీ అన్నది పచ్చి బూటకమని, ఆ పేరుతో పంచాయతీల నిధులు దారిమళ్లించి ముఖ్యమంత్రి సొంత పథకాలకు వాడుకుంటున్నారని సర్పంచ్లు ఆరోపిస్తున్నారు. సొంత పార్టీ నేతలు ఇలా.. రోడ్డెక్కడాన్ని వైసీపీ నేతలు పెద్దగా పట్టించుకోడం లేదు. పరువు తక్కువగా భావించడం లేదు. ఢిల్లీలో దర్నాలు చేసుకున్నా..పర్వాలేదన్నట్లుగా ఉన్నారు.
వైసీపీ సర్పంచ్లు అంతా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి గెలిచిన వాళ్లే్. ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన వాళ్లే. రేపు గ్రామాల్లో ఓట్లు వేయించాల్సింది కూడా వాళ్లే. అయినా ఎందుకు జగన్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తుందో కానీ.. వారు మాత్రం మాకు ఇదేం ఖర్మ అనుకుంటున్నారు.