వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇంత హఠాత్తుగా ఎందుకు నిర్ణయం తీసుకున్నారో చాలా మంది వైసీపీ నేతలకే అర్థం కాలేదు. వైసీపీ పార్టీల్లో చేరేందుకు రాజీనామాలు చేసిన ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోదించడం లేదు. కానీ పిల్లలు పుడితే జగన్ పేరే పెట్టుకుంటామని చెబుతున్న దువ్వాడను మాత్రం ఎమ్మెల్సీ పదవిలో ఉండగానే సస్పెండ్ చేశారు. అందుకే తెర వెనుక ఏదో జరిగిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
దువ్వాడ దుస్థితికి జగనే కారణం
దువ్వాడ శ్రీనివాస్ ఇప్పటి వరకూ ఎమ్మెల్యేగా ఒక్క సారి కూడా గెలవలేదు. కానీ ప్రతి ఎన్నికలలోనూ ఆయనకు టిక్కెట్ ఇచ్చేందుకు ప్రధాన పార్టీలు పోటీ పడేవి. పీఆర్పీ ఆవిర్భావం తర్వాత ఓ సారి టెక్కలికి ఉపఎన్నిక వస్తే.. అన్ని ప్రధాన పార్టీలూ ఆయనకే ఆఫర్ ఇచ్చాయి. అలాంటి బలమైన నేత ఇప్పుడు ఎవరికీ కాకుండా పోయాడు. కామెడీ స్టార్ అయిపోయాడు. వైసీపీలోకి వెళ్లిన తర్వాత ఆయనను ఆ పరిస్థితికి తీసుకు వచ్చింది ఆ పార్టీ నేతలే. ఆ పార్టీ వ్యూహకర్తలే.
అరాచకశక్తిగా మారిన వైసీపీ
దువ్వాడను అరాచకశక్తిగా వైసీపీ మార్చింది. బూతులు తిట్టి.. దందాలు చేసి.. రౌడీయిజం చేస్తే .. వైసీపీలో ప్రమోషన్లు వస్తాయని ఆయనను రెచ్చగొట్టారు. ఆయన రెచ్చిపోయారు. వైసీపీ అధికారంలో ఉన్న కాలంలో ఆయన చేసిన ఘోరాలు అన్నీ ఇన్నీ కావు. అచ్చెన్నాయుుడు మీద .. ఎర్రన్నాయుడు కుటుంబం మీద చేసిన దాడులు లెక్కలేనన్ని ఉన్నాయి. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి దందాలు చేసుకోమని కూడా పదవి చెప్పారు. తీరా ఇప్పుడు ఆయన పాతాళానికి పడిపోయారు.
వివాహేతర బంధంతో జగన్ కన్నా ఎక్కువ పబ్లిసిటీ
దువ్వాడ ఎన్ని చేసినా అదంతా తమ బ్రాండ్ అని వైసీపీ ప్రోత్సహించింది. వివాహేతర బంధం పెట్టుకుని భార్య, పిల్లలపై బూతులతో విరుచుకుపడినా పట్టించుకోలేదు. కేసుల పాలైనా పట్టించుకోలేదు. అలాంటి నేతల్ని ప్రోత్సహించి ఏం సందేశం ఇస్తారని ప్రశ్నలు వచ్చినా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆయనకే ఎక్కువ పబ్లిసిటీ వస్తోంది. జగన్ , దువ్వాడ తన సహజీవన భాగస్వామితో కలిసి ఒకే సారి వేర్వేరు చోట్ల మాట్లాడితే జగన్ మాటల్ని ఎవరూ పట్టించుకోవడంలేదు. అలాంటి సోషల్ మీడియా స్టార్ ను జగన్ భరించలేకపోయారు. అందుకే నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేశారు.
ఆయన ఇప్పుడు నట్టేట మునిగినట్లే. ఎందుకంటే ఆయన చేసిన నిర్వాకాలు.. వైసీపీ చేయించిన పనులకు ఏ పార్టీ కూడా చేర్చుకోదు.