ఈవీఎంలపై భారత రాజకీయ పార్టీల్లో ఎవరికీ నమ్మకం లేదు. చివరికి బీజేపీ, కాంగ్రెస్ కు కూడా లేదు. కానీ వారి అభిప్రాయాలు ఫలితాలు వచ్చినప్పుడల్లా మారిపోతూండటంతోనే సమస్య వస్తోంది. గెలిచిన వాళ్లు ఓకే అంటా.. ఓడిన వాళ్లు ఈవీఎంలు అంటారు. అక్కడే సమస్య వస్తోంది. ఇదంతా ఎందుకు అందరం కలసి బ్యాలెట్‌కే వెళదామని నిర్ణయిస్తే సమస్యే ఉండదు. కానీ అలా మాత్రం చేయరు.
దేశంలో అన్ని పార్టీలది ఈవీఎం వ్యతిరేకతే !
ఈవీఎంలను వ్యతిరేకించని పార్టీ లేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఈవీఎంలు వద్దు బ్యాలెట్టే ముద్దు అని బీజేపీ ఉద్యమం చేసింది. పుస్తకాలు రాసింది. ఇప్పుడు కాంగ్రెస్ ఆ పని చేస్తోంది. ప్రాంతీయ పార్టీలు ఎప్పుడూ ఈవీఎంలు వద్దనే చెబుతూంటాయి. కానీ తమ వాదన ఎలా ఉన్నా.. ఫలితాల్లో తాము గెలిచిన తర్వాత మాత్రం సైలెంట్ అయిపోతాయి. దాని వల్లే.. ఈవీఎంలపై రాజకీయ పార్టీలు చీలిపోతున్నాయి. అందుకే వాటి వాదనల్లో పస ఉండటం లేదు.
గతంలో ఫలితాలకు ముందే చంద్రబాబు ఆరోపణలు – ఇప్పుడు ఫలితాల తర్వాత జగన్ ఆరోపణలు
గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా వివిధ పార్టీలు పేపర్ బ్యాలెట్లకు తిరిగి తేవాలని చంద్రబాబు నేతృత్వంలో సుప్రీంకోర్టుకు వెళ్లి పోరాడారు. అప్పట్లో చంద్రబాబు ఈ పోరాటంలో ముందున్నారు. కానీ జగన్ రెడ్డి ఎగతాళి చేశారు. ఈవీఎంలు ఎంత కరెక్ట్ గా పని చేస్తాయో మీడియా ముందుకు వచ్చి చెప్పారు. అయితే ఇప్పుడు అదే జగన్ ఓడిపోయిన తర్వాత ఈవీఎంల మీద ఆరోపణలు చేస్తున్నారు. ఈవీఎంల వల్లే ఓడిపోయామంటున్నారు. గెలిచినప్పుడు మంచివని.. ఓడిపోయినప్పుడు చెడ్డవని వాదించడంతో కామెడీ అవుతున్నారు.
ఈవీఎంలు ప్రజాస్వామ్యానికి ప్రమాదమే
టెక్నికల్‌గా ట్యాంపర్ చేయలేని చిప్ అంటూ ప్రపంచంలో లేనే లేదు. అసలు సంబంధమే లేని ఫోన్ చొరబడి మొత్తం సమాచారం చోరీ చేస్తున్నారు. అలాంటిది ఓ చిప్ ను ట్యాంపర్ చేయలేరా ?. చేయలేరు అని వాదిస్తే అంత కంటే తెలివి తక్కువ పని ఉండదు. ఎందుకంటే ఆ చిప్ తయారు చేసింది కూడా మనిషి విజ్ఞానమే. మరి దాన్ని ట్యాంపర్ చేయడం ఆ మనిషి విజ్ఞానానికి చేతకాదా ?. అయితే ఓడిపోయినప్పుడే మాట్లాడి…. గెలిచినప్పుడు సమర్థిస్తే… ఈ విధానంలో మార్పు రాదు. అన్ని పార్టీలకు అనుమానాలు ఉన్నాయికాబట్టి.. విధానపరమైన నిర్ణయం తీసుకుని మళ్లీ బ్యాలెట్ ప్రవేశ పెట్టాలి.