కడప జిల్లా బద్వేలు ఉపఎన్నిక ఏకగ్రీవం చాన్స్ లేదని తేలిపోయింది . కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే కమలమ్మను అభ్యర్థిగా ఖరారు చేశారు. బీజేపీ తరపున కూడా మాజీ ఎమ్మెల్యే జయరాములు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది. నామినేషన్లకు ఎనిమిదో తేదీ ఆఖరు. దాంతో ఈ రోజు లేదా రేపు ఫైనల్ చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ఖరారు చేయడంతో ఉపఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం లేదు. సంప్రదాయం కోసం అంటూ తెలుగుదేశం, జనసేన పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి.
భారతీయ జనతా పార్టీ పోటీ చేసినా జనసేన మద్దతివ్వడం మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే పవన్ కల్యాణ్ డాక్టర్ సుధకే మద్దతిస్తున్నట్లుగా చెప్పారు. దివంగత ఎమ్మెల్యే భార్య కాబట్టి పోటీ చేయడం లేదని చెప్పడం నేరుగా మద్దతివ్వడం కిందకే వస్తుంది.ఇప్పుడు మిత్రపక్షం పోటీ చేసినా జనసేన మద్దతు ఇవ్వదు. అయితే తాము అభ్యర్థిని ప్రకటించిన తర్వాత వెళ్లి పవన్ కల్యాణ్‌ను అడుగుతామని సోము వీర్రాజు ప్రకటించారు.
వైసీపీ ఎమ్మెల్యే దాసరి వెంకటసుబ్బయ్య మరణంతో బద్వేలుకు ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఆయన సతీమణి దాసరి సుధను పోటీకి దించాలని వైసిపీ నాయకత్వం నిర్ణయించింది. ఆమె నామినేషన్ కూడా దాఖలు చేశారు. లక్ష ఓట్ల మెజార్టీనే లక్ష్యంగా పని చేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి ఆ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. 2015లో తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే వెంకటరమణ చనిపోవడంతో వైసీపీ పోటీ పెట్టలేదు. ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి బరిలో నిలవడంతో టీడీపీ అభ్యర్థికి లక్షా పదివేలకుపైగా మెజార్టీ వచ్చింది. ఆ మార్క్ దాటాలని సజ్జల లక్ష్యంగా పెట్టుకున్నారు. బద్వేలులో 2,12,739 మంది ఓటర్లు ఉన్నారు. 30వ తేదీన పోలింగ్ జరుగుతుంది.