ప్రతిపక్ష పార్టీ ఆ మధ్య గడప గడపకూ కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా క్షేత్రస్థాయిలో జరిగిన కొంత కసరత్తు వల్ల కొన్ని సమస్యలను ఆ పార్టీ గుర్తించింది. అయితే, వాటిని ఆధారంగా చేసుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఇప్పుడు ప్రతిపక్షం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం! నిజానికి, ప్రస్తుతం జగన్ పాదయాత్రలో ఉన్నారు. ప్రతీరోజూ టీడీపీ సర్కారు పనితీరుపై తీవ్రంగానే విమర్శిస్తున్నారు. అంశాలవారీగానే వేయాల్సిన ప్రశ్నలు వేస్తున్నారు. అయితే, ఇకపై క్షేత్రస్థాయిలో… అంటే ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలను వేదికలుగా మార్చుకుని అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు సిద్ధమౌతునట్టు సమాచారం.
జనవరి మొదటి వారం నుంచి జన్మభూమి – మన ఊరు కార్యక్రమాలను మరోసారి టీడీపీ ప్రభుత్వం నిర్వహించడానికి సిద్ధమౌతోంది. ఈసారి ప్రధానంగా ఫించన్లు, ఇళ్ల కేటాయింపులు, రుణాలు వంటి అంశాలపైనే దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే, ప్రతిపక్షం నేత జగన్ చేసే విమర్శల్లో, ఇచ్చిన హామీల్లో ఇవే అత్యధిక ప్రజా కర్షక అంశాలు కదా! ఈ జన్మభూమి కార్యక్రమం పూర్తయ్యేలోగా.. ఇంతవరకూ ప్రభుత్వ పథకాలను అందుకోలేనివారిని గుర్తించడం, అర్హులకు సత్వరమే సాయం చేయడం అనేవే ప్రాధాన్యతాంశాలు కాబోతున్నాయి. ఇప్పుడు ఇదే కార్యక్రమాన్ని వేదికగా చేసుకుని… స్థానిక నేతల్నీ, అధికార పార్టీల ఎమ్మెల్యేలను ప్రశ్నించేందుకు వైకాపా శ్రేణులు సిద్ధమౌతున్నట్టు తెలుస్తోంది.
అంతేకాదు… స్థానిక సమస్యలపై ఈసారి పోరాటం చేసేందుకు ఇతర పక్షాలు కూడా వైకాపా వెంట తీసుకొచ్చేలా కూడా ప్రయత్నం జరుగుతున్నట్టు తెలుస్తోంది. పెండింగ్ లో ఉన్న సమస్యల జాబితాను సేకరించి.. అధికారులను నిలదీసే ప్రయత్నంలో వైకాపా సిద్ధమౌతోంది. ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుని ప్రశ్నలు వేయాలని భావిస్తున్నారట. నిజానికి, జన్మభూమి కార్యక్రమంలో ప్రధానంగా అధికార పార్టీకి చెందినవారి హడావుడే కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే.. ఇన్నాళ్లూ ఇదేదో ప్రభుత్వ కార్యక్రమంగానే జరుగుతూ వచ్చింది. పెద్దగా రాజకీయ రంగు కనిపించలేదు. సమస్యలు – పరిష్కారాలు మాత్రమే అన్నట్టుగా కార్యక్రమాలు సాగేవి. కానీ, ఈసారి ఆ రంగు తప్పేట్టు లేదు.