వైసీపీ ఎమ్మెల్సీలను … పార్టీలో చేర్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మండలిని రద్దు చేయడానికి సిద్ధమైపోయి.. తీర్మానం ఢిల్లీకి పంపేసిన వైసీపీ.. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే మండలి రద్దయిపోతుందని ఆశలు పెట్టుకుంది. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఈ మేరకు భరోసా లభించిందని కూడా చెప్పుకున్నారు. కానీ అలాంటి సూచనలు రావడం లేదు. దీంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యేలోగానే.. శాసనమండలిలో ఫిరాయింపులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో.. వైసీపీ ఉన్నట్లుగా చెబుతున్నారు.
టీడీపీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాధరెడ్డిలు ఇప్పటికే వైసీపీకి మద్ధతు ప్రకటించారు. మరో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన కర్నూలు జిల్లా ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ కూడా అదే దారిలో ఉన్నారు. అనంతపురం జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్సీ కూడా అదే బాటలో ఉన్నారు. దీంతో మొత్తం ఐదుగురు ఎమ్మెల్సీలు పార్టీని వీడినట్లయింది. వీరుకాకుండా మరో ఐదుగురిపై వైసీపీ దృష్టి పెట్టింది. వారితో చర్చలు జరుపుతోంది. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యేలోపు టీడీపీని వీడేలా చూడాలని వైసీపీ భావిస్తోంది. టీడీపీకి శాసనమండలిలో బలం లేకుండా చేసి.. సెలెక్ట్ కమిటీకి పంపిన రెండు బిల్లులను వెనక్కి తెప్పించటంతోపాటు వాటిని ఆమోదింప చేయాలని వైసీపీ భావిస్తోంది.
శాసనమండలి రద్దు కోసం కనీసం ఏడాదిన్నర సమయం పడుతందని.. అప్పటికి వైసీపీకి మెజార్టీ వస్తుందని.. విశ్లేషణలు మొదటి నుంచి ఉన్నాయి. స్వయంగా జగన్ కూడా.. ఈ అంశాన్ని అంగీకరించారు. తమకు మెజార్టీ వస్తుందని తెలిసినప్పటికీ రద్దు చేస్తున్నామన్నారు. కానీ ఆయన . కేంద్రం.. తమ విజ్ఞప్తిని మన్నించి.. మండలిని రద్దు చేస్తుందని అనుకున్నారు. ఇప్పుడు అదే ఏడాదిన్నర ఖాయమని తేలుతూండటంతో.. ఫిరాయింపులకు ప్రయత్నిస్తున్నారు. అయితే.. మరో ఏడాదిన్నర తర్వాతైనా.. శాసనమండలి రద్దు అవడం మాత్రం ఖాయమని చెబుతున్నారు.