తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తమవైపుకు వచ్చినప్పటికీ, వారిని పార్టీలో చేర్చుకుంటే అనర్హత వేటుపడే అవకాశం ఉంది. వీరందర్నీ పార్టీకి రాజీనామా చేయించి వైసీపీలో చేరకుండా శాసనసభలో తటస్థ ఎమ్మెల్యేలుగా కూర్చొబెట్టాలని వైసీపీ వ్యూహకర్తలు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు వైసీపీ వల్లభనేని వంశీమోహన్ తో ఈ మిషన్ కు శ్రీకారం చుట్టింది. తెలుగుదేశం పార్టీ వంశీని సస్పెండ్ చేసింది. అంటే.. ఆయన వైసీపీలో చేరితే మాత్రమే… అనర్హతా వేటుకు గురవుతారు. లేకపోతే..జగన్ చెప్పే వరకూ ఎమ్మెల్యేగానే ఉంటారు. తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలంటే.. ఏడుగురు టీడీపీ ఎమ్మెల్యేలను వేరు చేయాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయించి తటస్థ గ్రూపుగా ఏర్పాటు చేయించే కొత్త వ్యూహానికి సిద్ధం చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
అవసరమైనప్పుడు ఆ నేతలతో తెలుగుదేశాన్ని, ఆ పార్టీ అధినేత చంద్రబాబును దూషించడమే కాకుండా రాజీనామాలు చేయించి అవసరమైతే ఉప ఎన్నికలకు కూడా వెళ్లాలని ఆ పార్టీ వ్యూహంగా ఉందని చెబుతున్నారు. మొత్తం ఏడుగుర్ని టీడీపీకి దూరం చేస్తే.. ఆ పార్టీ ప్రతిపక్ష హోదా రద్దవుతుంది. వంశీ దూరం కాగా..విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బీజేపీ వైపు చూస్తున్నారు. రేపో మాపో ఆయన కూడా టీడీపీకి రాజీనామా చేయనున్నారు. మరో నలుగురు, ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా వైసీపీతో టచ్ లో ఉన్నారని వైసీపీ వర్గాలు ప్రచారం చేసుకుంటున్నాయి.
వైసీపీతో టచ్ లో ఉన్నారని సమాచారం అందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలను తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఇటీవల పిలిపించి మాట్లాడారు. తమపై ఒత్తిడి పెరుగుతుందని, వ్యాపారపరంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని వారు చంద్రబాబు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. వీరిని చంద్రబాబు ఆపగలరా లేదా.. అనేదానిపై టీడీపీ ప్రతిపక్ష హోదా ఉంటుందా లేదా.. అనేది తేలుతుంది. అయితే.. ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా.. రాజకీయంలో వచ్చే మార్పేమీ ఉండదు.