నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు.. ఢిల్లీలో చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఆయన ఓ రకంగా వైసీపీని రోడ్డు మీద పెడుతున్నారు. పుండు మీద కారం చల్లినట్లుగా జగన్‌ను పొగుడుతూ.. ఆయన పాలనను విమర్శిస్తూ.. లేఖ రాయడంతో.. ఆయనపై వేటు వేయాల్సిందేనని.. ఆ పార్టీ పెద్దలు నిర్ణయించుకున్నారు. అయితే ఈ వేటు.. పార్టీ నుంచి సస్పెన్షన్ లేదా.. బహిష్కరణ కాకుండా.. ఆయన పదవి పోయేలా… అనర్హతా వేటు పడేలా ఉండాలని కసరత్తు చేస్తున్నారు. భవిష్యత్ లో న్యాయపరమైన చిక్కులు ఎదురైనా పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే వెనుకాడేదిలేదని మిగతా వారికి సంకేతాలు పంపాలని హైకమాండ్ ఆలోచిస్తున్నట్టు చెబుతున్నారు.
వేటు ఎలా వేయాలనేదే న్యాయనిపుణులతో ఇప్పటికే చర్చలు జరిపారు. గతంలో జేడీయూ ఎంపీగా ఉన్న శరద్ యాదవ్‌పై.. రాజ్యసభ చైర్మన్ అనర్హతా వేటు వేశారు. అదే పద్దతిలో రఘురామకృష్ణంరాజుపైనా.. వేటు వేయవచ్చని న్యాయసలహా ప్రభుత్వానికి అందింది. దాంతో.. ఈ వ్యవహరంపై లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాతోను, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో మాట్లాడాల్సిందిగా ఇద్దరు ఎంపీలను ఢిల్లీ పంపారు. వారిలో ఎంపీ బాలశౌరి ఒకరు. బాలశౌలి.. స్పీకర్‌తో పాటు పలువురు కేంద్రమంత్రులను కలిశారు. తమ వాదన వినిపించారు. రఘురామకృష్ణంరాజు చేసిన ఫిర్యాదులపై ప్రభుత్వం వివరణ కూడా ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
ముందుగా పార్టీ నుంచి బహిష్కరించి ఆ తర్వాత ఆయనపై అనర్హత వేటు వేయాలని వైసీపీ హైకమాండ్ లోక్ సభ స్పీకర్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రికి లేఖలు రాయలని వైసీపీ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. వీలైనంత త్వరగా న్యాయనిపుణులతో సంప్రదించిన అనంతరం ఢిల్లీ వెళ్లిన వైసీపీ ఎంపీలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత రాజుగారిపై క్రమశిక్షణ చర్యలకు రంగం సిద్ధం చేయాలని వైసీపీ హైకమాండ్ భావిస్తోంది. రఘురామకృష్ణంరాజు మాత్రం.. తనపై అనర్హతా వేటు వేసేంత శక్తి వైసీపీ హైకమాండ్‌కు లేదని భావిస్తున్నారు.