అసెంబ్లీ శీతాకాల సమావేశాలను ఏపీ ప్రతిపక్షం బహిష్కరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న సెషన్స్ కు తమ పార్టీ సభ్యులు హాజరు కావడం లేదని అధికారికంగా చెప్పారు. సమావేశాల బహిష్కరణకు వారు చూపుతున్న కారణం… ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలనీ, వారిపై అనర్హత వేటు వేయాలని! వాస్తవం ఏంటంటే.. ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్రలో ఉన్నారు. ఆయనకు సభకు వచ్చే పరిస్థితి లేదు. ఆయన లేనిదే సభలో గట్టిగా మాట్లాడే పరిస్థితిలో ఇతర ఎమ్మెల్యేలు లేరు. సో… ఇవన్నీ కప్పిపుచ్చుకోవడం కోసం ఫిరాయింపు నేతలపై చర్యలు తీసుకోవాలనే వాదన వినిపిస్తున్నారు. సరే, ప్రతిపక్షం సభలో లేకపోవడంతో ఈ అవకాశాన్ని అధికార పక్షం సద్వినియోగం చేసుకుంటోందనే చెప్పాలి. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గురించి ప్రజలకు చెప్పాల్సిందంతా సభా వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పేస్తున్నారు. చిన్నాపెద్దా అన్నీ కలిసి రాష్ట్రంలో ఓ 28 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి, పైన నాగావళి నుంచి మొదలుకొని కింద పెన్నా వరకూ రాష్ట్రంలోని నదీ జలాలను పంట పొలాలవైపు మళ్లించామనీ, రైతులు చాలా సంతోషంగా ఉన్నారంటూ ప్రెజెంట్ చేసుకున్నారు. ఆ మధ్య తెలంగాణ సీఎం కేసీఆర్ మాదిరిగానే చంద్రబాబు కూడా సభలో ఏపీ జల దృశ్యాన్ని ఆవిష్కరించారు. మొదటి రోజు సభను ఈ రకంగా వినియోగించుకున్నారు.
నిజానికి, ప్రతిపక్షం సభకు హాజరై ఉంటే, ఈ స్థాయిలో అధికార పార్టీ తమ గురించి చెప్పుకునే అవకాశం ఉండదు. ఎంతో కొంత అడ్డు తగులుతూనే ఉండేవారు. ప్రొటెస్ట్ కి వారికీ సభాపతి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. నిన్న శుక్రవారం కావడం, జగన్ పాదయాత్ర లేకపోవడంతో ప్రజల దృష్టి అంతా అసెంబ్లీ మీదే ఉంది. కాబట్టి, ఈ అవకాశాన్ని టీడీపీ సభ్యులు బాగానే వాడుకున్నారు. ఇప్పుడు వైకాపాలో ఇదే అంశంపై అంతర్మథనం మొదలైందని తెలుస్తోంది. ఎమ్మెల్యే రోజా మాటల్లో ఆ తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక సభకు వచ్చేదే లేదు, జనంలోనే జగన్ ఉంటారు, అక్కడే సమస్యల గురించి మాట్లాడతారని ఈ మధ్య చెప్పుకుంటూ వచ్చారు. కానీ, ఇప్పుడా స్వరం కాస్త మారి.. ఫిరాయింపు నేతలపై చర్యలు తీసుకుంటే, తాము వెంటనే సభకు వచ్చేస్తామని రోజా అంటున్నారు. సభకు హాజరు కాకూడదన్నది తమ అభిమతం కాదనీ, ఫిరాయింపు నేతలపై చర్యలు కావాలన్నదే తమ పోరాటం అన్నట్టుగా మాట్లాడారు.
వాస్తవం మాట్లాడుకుంటే, ఫిరాయింపు నేతలపై చర్యలు తీసుకునే పరిస్థితి ఇప్పుడు ఉందా..? జంప్ జిలానీ నేతలు రాజీనామా పత్రాలు ఇచ్చేశామనే అంటున్నారు. విషయం కోర్టులో ఉందని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. అంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో వైకాపా ఏ స్థాయిలో నిరసన తెలిపినా ప్రయోజనం ఉండదనేది స్పష్టం. ఈ నేపథ్యంలో వైకాపాలో ప్రస్తుతం లోపిస్తున్న స్పష్టత ఏంటంటే… ఫిరాయింపు నేతలపై చర్యల పేరుతో ఈ శీతాకాల సమావేశాలను మాత్రమే బహిష్కరిస్తున్నారా, లేదంటే ఆ తరువాత జరగబోయే సమావేశాలకు కూడా గైర్హాజరు అవుతారా అనేది! మొత్తానికి, శాసనసభకు హాజరు కాకపోవడంపై అన్ని వర్గాల నుంచీ విమర్శలు రావడం, తమ గైర్హాజరీని అధికార పక్షం బాగా వినియోగించుకుంటూ ఉండటం, ఫిరాయింపు నేతలపై చర్యలు ఇప్పట్లో ఉండే అవకాశం కనిపించకపోవడం… వెరసి వైకాపాలో కొంత అంతర్మథనానికి ఇవన్నీ కారణమౌతున్నట్టు సమాచారం.