పెద్దగా రాజకీయ పరిజ్ఞానం లేకపోయినా.. కేవలం నోటినే నమ్ముకున్న నేతల్లో రోజా ఒకరు. ప్రత్యర్థులపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ తరచూ ఆమె వార్తల్లో నిలుస్తారు. జగన్ కూడా ఇప్పుడు ఆమెను కేవలం చంద్రబాబును గట్టిగా తిట్టడానికే పార్టీలో భరిస్తున్నట్లుగా ఉంది పరిస్థితి. తాజాగా ఈ రోజాకు మరో షాక్ తగిలింది. వచ్చే ఎన్నికల్లో రోజాకు టికెట్ ఇవ్వకూడదని జగన్ భావిస్తున్నారట. గత ఎన్నికల్లోనే ఎలాగోలా కిందామీదా పడి తన కెరీర్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారామె. అదీ కేవలం 900 ఓట్ల తేడాతో. ఇప్పుడా సీటూ పోయే పరిస్థితి కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో రోజాపై ఓడిపోయిన గాలి ముద్దు కృష్ణమనాయుడు ఈ మధ్యే చనిపోయారు. దీంతో ఆ స్థానం నుంచి ఈసారి ఆయన కుమారుడు భానుప్రకాశ్ నాయుడుకు అవకాశం కల్పించాలని టీడీపీ భావిస్తోంది. గాలి మరణంతో టీడీపీకి సానుభూతి పవనాలు వీస్తున్నాయి. అదే సమయంలో అటు రోజాపైనా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో గాలి ముద్దుకృష్ణమ కుటుంబం నుంచి ఎవరిని దింపినా.. విజయం ఖాయమన్న ధీమా కనిపిస్తోంది. ఆ లెక్కన నగరి నుంచి టీడీపీ అభ్యర్థి దాదాపు ఖరారైనట్లే.
వైసీపీ అభ్యర్థిపైనే సస్పెన్స్ నెలకొంది. ఈసారి కచ్చితంగా రోజాకు టికెట్ ఇవ్వకూడదని జగన్ ఫిక్సయ్యారట. అటు రోజాకు కూడా పరిస్థితి అర్థమైపోయింది. నగరి నుంచి పోటీ చేస్తే ఓటమి తప్పేలా లేదని ఆమె భావిస్తున్నారు. దీంతో రోజా కూడా తనకు నగరి టికెట్ వద్దంటే వద్దని ఇప్పుడు మొండికేస్తున్నారట. దీని బదులు మరోస్థానంలో ఆమె టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నగరిలో ఎవరిని దింపాలన్నదానిపై వైసీపీలో తర్జనభర్జనలు నడుస్తున్నాయి. టీడీపీకి సానుభూతి ఉన్న నేపథ్యంలో అక్కడ ఎవరిని దింపినా ఓటమి తప్పదేమో అన్న సందేహం జగన్‌కు ఉంది. దీంతో సీనియర్‌ను దింపే కన్నా.. ఎవరో ఒక జూనియర్‌ను అక్కడ నిలబెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన చేస్తోంది. ఇక్కడ ఎవరో ఒకరిని బలి చేసినా.. ఇప్పుడా రోజాను ఎక్కడి నుంచి బరిలోకి దింపాలన్నది పెద్ద ప్రశ్నగా మారిపోయింది.