వైసీపీలో టిక్కెట్లు ఇస్తామన్నా వద్దనే వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. కర్నూలు ఎంపీ టిక్కెట్ ఇచ్చినా అవసరం లేదని తేల్చేసిన మంత్రి గుమ్మనూరు జయరాం తరహాలోనే తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన కోనేటి ఆదిమూలం కూడా తనకు ఎంపీ టిక్కెట్ అవసరం లేదంటున్నారు తన నియోజకవర్గం సత్యవేడు ఎమ్మెల్యే టిక్కెట్ మాత్రమే కావాలంటున్నారు. తిరుపతి ఎంపీగా ఉన్న గురుమూర్తికి సత్యవేడు టిక్కెట్ ఇచ్చారు.
ఎంపీగా పోటీ చేయడం కోనేటి ఆదిమూలంకు ఇష్టం లేదు. తనపై మంత్రి పెద్దిరెడ్డి భారీ కుట్ర చేశారని మండిపడ్డారు. తనను నమ్మించి నట్టేట ముంచారని, నాలాంటి వారికి మోసం చేస్తారా? అని ఆవేదన వ్యక్తం చేశారు. 14 ఏళ్లు వైఎస్ఆర్సీపీ జెండా మోసి, నిరంతరం శ్రమించానని, ప్రజలు తనను భారీ మెజార్టీతో గెలిపించారని ఆదిమూలం కన్నీళ్లు పెట్టుకున్నారు. 1989లో స్కూటర్ మీద వచ్చే పెద్దిరెడ్డి. ఈ రోజు వేల కోట్లు సంపాదించారన్నారు. పెద్దిరెడ్డి చెప్పిందే నియోజకవర్గంలో చేశాననన్నారు. నియోజకవర్గంలో అన్ని వర్గాల సహకారం తనపై ఉందని అన్నారు. దళితుడయిన తనను అవమానపరుస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు.
సత్యవేడు నియోజకవర్గ ఆత్మీయ సమావేశాన్ని మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో తిరుపతిలో నిర్వహించారు. దీనికి ఆదిమూలంను పిలవలేదు. తనకు తెలియకుండా సమావేశం పెట్టడమేమిటని ఆందోళన వ్యక్తం చేశారు. చెవిరెడ్డి , కరుణాకర్‌రెడ్డి, రోజా స్థానాల్లో ఇలా ప్రకటించగలరా అంటూ ప్రశ్నించారు. సత్యవేడు స్థానంలో మంత్రి పెద్దిరెడ్డి అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపట్టారని ఆరోపించారు. మంత్రి అక్రమాలన్నింటినీ నాపై తోసి సత్యవేడు నుంచి తప్పించారని ఆరోపించారు. మంత్రి పెద్దిరెడ్డి చేసిన కుట్రలో భాగంగానే తనను ఎమ్మెల్యే స్థానం నుంచి తప్పించి ఎంపీ స్థానానికి పంపిస్తున్నారని విమర్శించారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రిజర్వుడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో వైసీపీ నేతలు ఓ ఆటాడుకుంటున్నారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి ఎవరైనా దళిత నేత బలపడుతున్నారంటే.. పక్కన పెట్టేస్తున్నారు. అలాంటి వారంతా ఫైరవుతున్నారు.